Friday, May 22, 2026
Homeమహబూబ్‌నగర్‌Awareness | అతివేగమే ప్రమాదాలకు కారణం

Awareness | అతివేగమే ప్రమాదాలకు కారణం

  • రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు

రోడ్డుప్రమాదాలు,తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి,అధికారులతో సమావేశం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో కొత్త రహదారులు, బైపాస్‌లపై అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం సంభవిస్తున్న నేపథ్యంలో, ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చర్యలు చేపడుతున్నట్లు , ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ఎన్.ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ చర్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రమాదాలకు కారణం అవుతున్న బైపాస్ రోడ్డు పై ప్రత్యేక దృష్టి సారించి స్పీడ్ బ్రేకర్ లు ,స్పీడ్ గన్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన రహదారులపై అనుమతి లేకుండా మీడియన్లను తెరవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు అధికమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాలకొండ బైపాస్ రోడ్, భూత్పూర్ నుంచి వన్‌టౌన్ వరకు రహదారి, హన్వాడ నుంచి పాలమూరు యూనివర్సిటీ వరకు కొత్తగా నిర్మించిన రహదారులపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోందన్నారు.

- Advertisement -

సంబంధిత శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని, అనుమతి లేని మీడియన్ ఓపెనింగ్‌లను మూసివేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

పట్టణానికి అనుసంధానమైన ప్రధాన రహదారులపై హెచ్చరిక బోర్డులు, వేగ పరిమితి సూచికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదాల నివారణలో భాగంగా ప్రస్తుతం ఉన్న 200 సీసీటీవీ కెమరాలకు అదనంగా మరో 500 కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర నిఘా ఉంచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నాలుగు ప్రధాన రహదారులపై స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసి అతివేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రధాన జంక్షన్‌ల వద్ద తగిన లైటింగ్ లేకపోవడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, అవసరమైన చోట స్ట్రీట్ లైట్లు, హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.

జిల్లా ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ, ప్రమాదాలకు గురవుతున్న జంక్షన్‌లను గుర్తించి అక్కడ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ప్రభుత్వం, పోలీసు శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యల ను ప్రజలకు తెలియపరుస్తూ ప్రతి నెల మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో మేయర్4 గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, అదనపు ఎస్.పి. ఎన్ బి.రత్నం,డి.ఎస్.పి.వెంకటేశ్వర్లు,నగరపాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి ఆర్ అండ్ బి ఈ ఈ సంధ్య, జాతీయ రహదారులు, రవాణా, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News