- సెంట్రల్ విస్టాలో హైడ్రోజన్ బస్సులు..
- కాలుష్య నివారణకు చర్యలు..
- ఇండియన్ ఆయిల్ తో కలిసి, ఢిల్లీ మెట్రో విన్నూత్న ప్రయోగం..
దేశ రాజధాని నడిబొడ్డున పర్యావరణ విప్లవానికి నాంది పడింది. కాలుష్య రహిత ప్రజా రవాణా దిశగా భారత్ మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండియన్ ఆయిల్), ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో న్యూఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సెంట్రల్ విస్టా’ ప్రాంతంలో సరికొత్త ‘హైడ్రోజన్ పవర్డ్ షటిల్ బస్’ సర్వీస్‌ను ఘనంగా ప్రారంభించారు. మెట్రో ప్రయాణికులకు లాస్ట్-మైల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేస్తూ.. సెంట్రల్ సెక్రటేరియట్, సేవ తీర్థ్ మెట్రో స్టేషన్ల మధ్య ఈ జీరో-ఎమిషన్ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కాలుష్య రహిత ప్రయాణం :
ప్రాథమికంగా 35 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన రెండు అత్యాధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
రద్దీ వేళల్లో లభ్యత :
అత్యంత కీలకమైన పరిపాలనా విభాగం కావడంతో.. ప్రభుత్వ ఉద్యోగులు, సందర్శకుల సౌకర్యార్థం పనిదినాల్లోని పీక్ అవర్స్ ఈ బస్సులు నడుస్తాయి.
కీలక ప్రాంతాల అనుసంధానం :
ఈ రూట్ రాజధానిలోని ప్రధాన ప్రభుత్వ భవనాలు, చారిత్రాత్మక కట్టడాలైన కర్తవ్య భవన్, విజ్ఞాన్ భవన్, ఇండియా గేట్ మీదుగా సాగుతుంది.
భద్రతకు పెద్దపీట – సమర్థవంతమైన నిర్వహణ :
ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఈ బస్సుల్లో అధునాతన జీపీఎస్ ట్రాకింగ్, సీసీటీవీ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో టికెటింగ్, ప్రయాణికుల సేవలు, బస్సుల నిర్వహణ బాధ్యతలను డీ.ఎం.ఆర్.సి. చూసుకుంటుండగా.. పర్యావరణహిత హైడ్రోజన్ ఇంధన సరఫరా, డ్రైవర్ల బాధ్యతను ఇండియన్ ఆయిల్ సంస్థ నిర్వహిస్తోంది.
నెట్-జీరో లక్ష్యం దిశగా భారత్ :
భవిష్యత్ ఇంధనంగా పిలవబడే హైడ్రోజన్ మొబిలిటీ రంగంలో ఇండియన్ ఆయిల్ ఇప్పటికే దూసుకుపోతోంది. హర్యానాలోని పానిపట్‌లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను నెలకొల్పడంతో పాటు, దేశవ్యాప్తంగా వినూత్న పైలట్ ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ క్రమంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పట్టణ రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. కాలుష్య రహిత, కార్బన్ రహిత భారతదేశాన్ని ఆవిష్కరించాలనే దేశ దీర్ఘకాలిక లక్ష్య సాధనలో ఇదొక విప్లవాత్మక అడుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు..
