- ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొరవడిన పర్యవేక్షణ..!
- కార్యాలయాల నుంచే నివేదికలు!
- రైతుల సమస్యలు పట్టించుకోని వైనం
- ధాన్యం విక్రయానికి వచ్చిన రైతులకు ఇబ్బందులు
పాపన్నపేట మండల పరిధిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారుల సహకారం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం తూకాల్లో ఆలస్యం, హమాలీల కొరత, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాల లోపం వంటి సమస్యలతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేవని, తాగునీరు, నీడ వంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కొనుగోలు కేంద్రాలను ఎంతవరకు పర్యవేక్షిస్తున్నారో అక్కడ నిర్వహించే విజిటర్స్ రిజిస్టర్‌లను పరిశీలిస్తేనే స్పష్టమవుతోంది.
పలువురు అధికారులు కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించకుండానే కార్యాలయాల నుంచే నివేదికలు పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పర్యటన ఉన్న రోజుల్లో మాత్రమే క్షేత్రస్థాయి అధికారులు కేంద్రాల వద్ద కనిపిస్తున్నారని, మిగతా రోజుల్లో రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు కేంద్రాలకు రాకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
