- భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్
ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. గురువారం ఎంపిక చేసిన రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని తెలిపారు. ప్రతి ఎన్నికకు ముందు ఎన్నికల జాబితాలను నవీకరించవలసిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు.

అర్హత కలిగిన ప్రతి భారత పౌరుడు, 18 సంవత్సరాలు నిండిన వారు, ఆయా నియోజకవర్గంలో సాధారణ నివాసితులు, చట్టపరంగా అనర్హులు కాని వారు ఓటరుగా నమోదు కావచ్చని తెలిపారు. యువ ఓటర్ల నమోదు, మహిళల భాగస్వామ్యం, దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇంటింటి సర్వేలు, పోలింగ్ స్థాయి అధికారుల పని తీరు, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, తొలగింపు, సవరణ ప్రక్రియలను ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాలపట్టికలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, దేశ వ్యాప్తంగా గతంలో కూడా పలు మార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలోకి చేరకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని, అక్టోబర్ 27, 2025 నాటికి ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా పూరించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ ఫారమ్‌ల సేకరణ కోసం బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించేలా చూడాలని, ఎన్యూమరేషన్ ఫారమ్ అందజేసిన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేర్చడం జరుగుతుందని, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని తెలిపారు.ఈ సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టడం జరుగుతుందని, ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1 వేయి 200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
హై-రైజ్ బిల్డింగ్లు, మురికివాడలలో కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఒక కుటుంబ సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని కోరడం జరిగిందని, ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత అట్టి జాబితాను వెబ్సైట్లో, స్థానిక కార్యాలయాలలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.
జాబితాలో పేర్ల చేర్పులు, తొలగింపుల కోసం ఫారమ్ 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుదారులకు తగిన విచారణ ద్వారా వారి అర్హతను ధృవీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను సమకూర్చడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
