Sunday, May 10, 2026
Homeమహబూబ్‌నగర్‌స్వీయ వివరాలు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా..

స్వీయ వివరాలు నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా..

  • జన గణన 2027 స్వీయ గణన ద్వారా నమోదు చేసుకున్న వైనం..
  • మే 10 వరకు స్వీయ గణన చేసుకునేందుకు అవకాశం..

జన గణన 2027 లో భాగంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా శనివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన లో పాల్గొని లాప్ టాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నారు. జన గణనలో ఎవరికి వారు స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జన గణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన (Digital Self-Enumeration) విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్ లో కానీ , మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు. మే 10వ తేదీ వరకు స్వీయ గణన చేసుకునేందుకు అవకాశం ఉందని, స్వీయ గణన ప్రతి ఒక్కరూ పాల్గొని
వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జన గణనకు సంబంధించిన సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని అన్నారు.

- Advertisement -

వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేకమైన సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడి (SEID) జారీ చేయబడుతుందని తెలిపారు. ప్రభుత్వంచే నియమించబడిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 09వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐ.డి ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని అన్నారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని కలెక్టర్ తెలిపారు.

అయితే, స్వీయ గణనలో ఖచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జన గణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. దేశ అభివృద్ధి ,ప్రణాళికల రూపకల్పనలో ఎంతగానో దోహదపడే జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News