- 17 రకాల సేవలను ఆన్ లైన్ లోకి తీసుకొచ్చిన రవాణా శాఖ..
తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ భారీ ఊరట కల్పించింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన 17 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తూ ‘ఫేస్‌లెస్’ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై చిన్న చిన్న పనుల కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ గంటల తరబడి తిరగాల్సిన అవసరం లేదని, ఆధార్ ధ్రువీకరణ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలను పొందవచ్చని రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ కె. ఇలంబర్తి తాజాగా ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకతను పెంచడం, సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానం ద్వారా లెర్నర్ లైసెన్స్‌లో పేరు, చిరునామా, ఫొటో, సంతకం మార్పులు, డూప్లికేట్ లెర్నర్ లైసెన్స్ జారీ వంటివి సులభంగా చేసుకోవచ్చు. అలాగే, అత్యంత కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ లైసెన్స్, లైసెన్స్ రీప్లేస్‌మెంట్, పుట్టిన తేదీ మార్పు, బయోమెట్రిక్ వివరాల సవరణ వంటి సేవలను కూడా ఫేస్‌లెస్ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ సేవలను పొందడానికి పౌరులు అధికారిక ‘సారథి’ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.
