- అతి పిన్నవయసులో కెప్టెన్ గా రికార్డ్..Vaibhav Sooryavanshi
- ప్రస్తుతం వైభవ్ వయసు 15 ఏళ్ల 232 రోజులు..Vaibhav Sooryavanshi
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరో అరుదైన ఘనత సాధించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఓ జట్టుకు కెప్టెన్సీ వహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. శనివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన 2026-27 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో బీహార్ జట్టుకు నాయకత్వం వహించాడు. ప్రస్తుతం వైభవ్ వయసు 15 ఏళ్ల 232 రోజులు మాత్రమే. ఇప్పటివరకు ఈ రికార్డు క్రొయేషియాకు చెందిన జాక్ వుకుసిచ్ పేరిట ఉండేది. అతడు 17 ఏళ్ల 311 రోజుల వయసులో తన జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు సూర్యవంశీ ఆ రికార్డును అధిగమించాడు. దీంతో పురుషుల టీ20ల్లో జట్టును నడిపించిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.
బీహార్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో సూర్యవంశీ బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ తరఫున 12 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఎడమచేతి వాటం పేసర్ చేతన్ సకారియా బౌలింగ్‌లో క్యాచ్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ టోర్నీలో బీహార్ తరఫున సూర్యవంశీ ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. సౌరాష్ట్రతో మ్యాచ్ తర్వాత మరో మ్యాచ్ ఆడగానే దోహాలో జరగనున్న ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఎమర్జింగ్ టోర్నీ కోసం భారత్-ఏ జట్టుతో చేరనున్నాడు. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలు 50 ఓవర్ల ఫార్మాట్లో జరగనున్నాయి. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తరఫున రెండు టీ20లు ఆడిన సూర్యవంశీ.. ఓ మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 133 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
