Friday, May 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGachibowli | లంచాల మత్తులో టౌన్లానింగ్ అధికారులు

Gachibowli | లంచాల మత్తులో టౌన్లానింగ్ అధికారులు

ప్రజా ప్రయోజనాలు గాలికి.. ప్రభుత్వ ఆదాయానికి గండి..

  • గచ్చిబౌలిలో నిబంధనలకు పాతర
  • నివాస గృహాల్లో ‘కమర్షియల’ దందా..!
  • లాడ్జ్ నిర్వహణతో ప్రజలకు తప్పని ఇక్కట్లు
  • అడ్డదిడ్డ పార్కింగ్‌తో ట్రాఫిక్‌కి అంతరాయం
  • అధికారులపై స్థానిక ప్రజల ఆగ్రహం

అక్కడ ఏమి జరుగుతోందో అర్ధం కాదు.. నివాసప్రాంతంలో నిర్భయంగా లాడ్జ్/సర్వీస్ అపార్ట్‌మెంట్ అంటూ దందా నడుపుతున్నారు.. పైగా ప్రీమియం కో లివింగ్ అంటూ పెద్ద బోర్డు.. ఈ క్రమంలో ఇక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు..? లంచాలు పుచ్చుకుని ఏసీరూముల్లో సేదతీరుతున్న అధికారులా..? ప్రభుత్వం కళ్లుగప్పి తమ దందాను నిర్భయంగా నిర్వహిస్తున్న యాజమాన్యానిదా..?

- Advertisement -

నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తుంటే, ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ? గచ్చిబౌలి టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ భవనమే ఒక నిలువెత్తు సాక్ష్యం. నివాస అవసరాల కోసం అనుమతులు పొంది, నిస్సిగ్గుగా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నా.. కళ్లుండి చూడలేని కబోదుల్లా అధికారులు వ్యవహరించడం వెనుక ‘భారీ’ వ్యవహారమే ఉందని తెలుస్తోంది.

నివాస అనుమతి.. కమర్షియల్ దందా:

గచ్చిబౌలి, సర్వే నం. 86లోని ప్లాట్ నం. 12, 13లో నిర్మించిన భవనం చట్టప్రకారం కేవలం నివాస అవసరాల కోసం మాత్రమే అనుమతి పొందింది.

పర్మిట్ డ్రామా :

13/08/2023న బిల్డింగ్ పర్మిట్ పొందిన యజమాని, నిర్మాణం పూర్తయ్యాక అధికారులను ‘ప్రసన్నం’ చేసుకుని 16/07/2025న ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా దక్కించుకున్నారు.

అసలు బండారం :

ఓసీ చేతికి రాగానే, రాత్రికి రాత్రే ఆ నివాస భవనం కాస్తా అరేలీయా సూట్స్ అనే కమర్షియల్ లాడ్జ్/సర్వీస్ అపార్ట్‌మెంట్‌గా రూపాంతరం చెందింది. నివాస ప్రాంతంలో బోర్డులు తగిలించి వ్యాపారం చేస్తున్నా, అధికారులకు అది కనిపించకపోవడం వెనుక ఎన్ని లక్షల ముడుపులు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు.

చట్టం చుట్టమైందా? ఉల్లంఘనల పర్వం ఇదీ :

  1. కన్వర్షన్ లేదు.. కప్పం మాత్రం ఉంది : భూ వినియోగ మార్పిడి లేకుండా నివాస గృహాన్ని వాణిజ్యపరంగా వాడటం నేరం. కానీ ఇక్కడ యజమాని ‘అదనపు ఆదాయం’ కోసం, అధికారులు ‘ముడుపుల’ కోసం చట్టాన్ని తుంగలో తొక్కారు.
  2. ట్రేడ్ లైసెన్స్ మాయం : ఎటువంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, కమర్షియల్ పన్నులు చెల్లించకుండా పబ్లిక్ గా ప్రభుత్వం కళ్ల ముందే కోట్లు గడిస్తున్నారు.
  3. నిబంధనలకు విరుద్ధంగా ఓసీ వినియోగం : భవనం వినియోగం మారినప్పుడు రివైజ్డ్ ఓసీ తీసుకోవాలన్న నిబంధన ఉన్నా, పాత సర్టిఫికెట్‌తోనే దందా నడిపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని మామూళ్లు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజా ప్రయోజనాలు గాలికి.. ప్రభుత్వ ఆదాయానికి గండి! :

ఈ అక్రమ దందా వల్ల స్థానిక నివాసితులు నరకం చూస్తున్నారు. అపరిచితుల రాకపోకలు, అర్థరాత్రి వరకు హోరు, రోడ్లపై అడ్డగోలు పార్కింగ్‌తో ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన కన్వర్షన్ ఛార్జీలు, వాణిజ్య పన్నులకు భారీగా గండి పడుతోంది.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు :

”నివాస స్థలంలో లాడ్జీలు నడుపుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? లేక ముడుపుల మత్తులో ఉన్నారా? చట్టం కేవలం సామాన్యుడికేనా? అక్రమార్కులకు వర్తించదా?” అని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.

ఉన్నతాధికారుల స్పందన ఏది? :

కళ్ల ముందే ఇంత అక్రమం జరుగుతున్నా జీహెచఎంసీ ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? విజిలెన్స్ విభాగానికి ఈ బాగోతం కనిపించడం లేదా? తక్షణమే ఈ భవనాన్ని సీజ్ చేసి, అక్రమంగా ఓసీ జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News