పాఠశాలలో విద్యార్థులు చూపిన ప్రతిభకు పురస్కారాలను అందచేయడమే కాకుండా వారి తల్లిదండ్రులను విద్యార్థులచే ఘనంగా పాదపూజ నిర్వహించి సర్వారం పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలిచింది. మండలంలోని సర్వారం ప్రభుత్వ పాఠశాలలో చదివి గురుకులాల్లో స్థానం సంపాదించిన విద్యార్థులకు, తరగతులలో ప్రథమ ద్వితీయ శ్రేణి సాధించి తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు గురువారం పురస్కారాలను అందించారు. గ్రామానికి చెందిన దాతలు మాజీ సర్పంచ్ సామల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ మైల సీతయ్య సహకారంతో విద్యార్థులకు మెమొంటోలు నగదు బహుమతులను అందించారు.
ప్రతిభ చాటి బహుమతులు పొందిన విద్యార్థుల చేత వారి తల్లిదండ్రులకు ఘనంగా పాదపూజ నిర్వహించారు. పెంచి పెద్ద చేసి రెక్కలొచ్చిన అనంతరం నేటి ఆధునిక సమాజంలో తల్లిదండ్రులను విస్మరిస్తున్న నేటి తరానికి తల్లిదండ్రుల గౌరవాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఏ పిసి సిద్ధం త్రివేణి, గ్రామ సర్పంచ్ వినోద నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కందుల పద్మ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ సామల వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ మైల సీతయ్య, డాక్టర్ మైల శ్యామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేకల రాజారావు, ఉపాధ్యాయులు గోవిందు, సైదులు, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, కోటేశ్వరి, అంగన్వాడి టీచర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
