- సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడ్డ జగద్గురువు..
జీవించింది 32 ఏళ్లు మాత్రమే! కానీ విశ్వగురువుగా ఖ్యాతి పొందిన మహనీయుడు నడిచే దైవం శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు! ఆదిశంకరాచార్యుల పేరు వినగానే నమస్కరించని వారంటూ ఉండరంటే అది అతిశయోక్తి కాదు. తన బోధనలతో అశేష జనావళిని ఆధ్యాత్మికంగా జాగృతం చేసి, సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన జగద్గురువులు ఆదిశంకరులు. వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి సందర్భంగా ఈ కథనంలో ఆ మహనీయుని స్మరించుకునే భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ ఆదిశంకరుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. వేదాలు, పురాణాలు కాచి వడపోసి గురువులు, మహర్షులు అందించిన అమూల్య సంపద మన సనాతన ధర్మం. విభిన్న మార్గాల మేలు కలయిక అయిన మన సనాతన ధర్మాన్ని సమన్వయపరిచి, వాటిలోని ఏకాత్మను దర్శింపజేసిన గురువులు ఆదిశంకరులు.
శైవ, వైష్ణవ, శాక్త, గాణాపత్య, సౌర, స్కాంద అనే ఆరు ఉపాసన పద్దతులను మధించి ప్రపంచానికి అందించిన షణ్మత స్థాపనాచార్యులుగా ఖ్యాతి చెందారు శంకరులు. జ్ఞాన, భక్తి, కర్మ మార్గాలకు పరమార్థికత జోడించి ప్రభోదించి విశ్వ గురువులయ్యారు. ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా ఆదిశంకరులు సనాతన ధర్మ వ్యాప్తికి చేసిన కృషి గురించి తెలుసుకుందాం.
మే 21, మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి కాబట్టి ఈ రోజునే శంకర జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా శంకరుల జన్మ విశేషాలు తెలుసుకుందాం.
దేవుని సొంత భూమిగా పేరొందిన కేరళలోని కాలడి గ్రామంలో క్రీ.శ. 788 సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి రోజున శ్రీమతి ఆర్యాంబ, బ్రహ్మశ్రీ శివ గురుదేవుల దంపతులకు శంకరులు జన్మించారు. క్రీ.శ 820 సంవత్సరంలో శివైక్యం పొందారు. ఆదిశంకరులు భౌతికంగా మన మధ్య జీవించి ఉన్నది 32 ఏళ్లు మాత్రమే అయినా అంతర్యామిగా అయన ఈనాటికి మనమధ్య తిరుగాడుతూనే ఉన్నారు. చిరకాలం శాశ్వతంగా నిలిచిపోయే అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదించి చిరస్మరణీయులయ్యారు.
