- మేనేజర్ పదవికి రాజీనామా..
- మూడేళ్లపాటు పీసీబీ సీఈఓ గా బాధ్యతలు..
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పదవిని వీడారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి వాసీమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు 2019 నుంచి మూడేళ్లపాటు ఆయన పీసీబీ సీఈవోగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఐసీసీ జనరల్ మేనేజర్ పదవి నుంచి వైదొలిగినా.. జూన్ నెలాఖరులో ఖాన్ మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
గత రెండేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వివిధ కారణాలతో అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వీడుతున్నారు. అల్లార్డెస్‌తోపాటు యాంటీ కరప్షన్ యూనిట్‌కు చెందిన క్రిస్ టెట్లీ (ఈవెంట్స్ హెడ్), అలెక్స్ మార్షల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానంలో గౌరవ్ సక్సేనా, ఆండ్రూ వచ్చి చేరారు. ఇప్పుడు వాసిమ్‌ఖాన్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టిన వాసీమ్ ఇంగ్లండ్‌లో జన్మించడం గమనార్హం. అక్కడే తన క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు.
