- అడుగంటుతున్న భూగర్భ జలాలు..
- ట్యాంకర్లతో నీటి తరలింపు..
- ధనార్జనే ధ్యేయంగా నీటి వ్యాపారం..
- చోద్యం చూస్తున్న అధికారులు..
వేసవి ప్రారంభం లోనే ఎండలు దంచికొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటుతు న్నాయి. దీంతో వేపవిలో తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజల తాగునీటి అవసరాలను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా అనధికార బోర్లు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకుంటున్నారు. ఒక్కో పాయింట్ ద్వారా రోజుకు పది నుంచి ముప్పై ట్యాంకర్ల వరకు అక్రమంగా నీటిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ తతంగమంతా ఏ మారుమూల ప్రాంతం లో జరుగుతుందనుకుంటే పొరపాటుపడ్డట్లే ఇది నగర శివారు ప్రాంతమైన మైసమ్మగూడలో యథేచ్చగా నీళ్ల వ్యాపారం జోరందుకుంది. కొందరు భూగర్భజలాలు తోడేస్తూ వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ట్యాంకర్ల ద్వారా నీటి విక్రయాలు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. నీటి పొదుపును పటిస్తున్నాం, నీటి ఎద్దడిని రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వాల్టా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్నామంటూ అధికారులు ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచ్చలవిడిగా బోర్ల తవ్వకం..
మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిదిలోని మైసమ్మగూడలో భూగర్భజలాలు అడుగంటు తున్నాయి. దీనికీ ప్రధాన కారణం మైసమ్మగూడలో పలు విద్యాసంస్థలు ఉండటంతో ఇక్కడ విద్యార్థి వసతి గృహాలు వందల సంఖ్యలో నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల ప్రతి భవనానికి ఒక్కో బోరు తవ్వడంతో ఎండాకాలం రాకముందే నీటి ఎద్దడి మొదలైంది. వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు అవసరమైన నీటి వసతికి ఉన్న డిమాండ్ ను గమనించిన కొందరు దళారులు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ట్యాంకర్ల ద్వారా ఒక్కో హాస్టల్ కు రోజుకు ఐదు చొప్పున నీటిని సరఫరా చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.

పర్యావరణాన్ని కాపాడి భూగర్భజలాల మట్టలు పడిపోకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగాంగా ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ నిబంధనల ప్రకారం అనుమతి లేనిదే ఇసుక తీయకూడదు, బోర్లు తవ్వకూడదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వేస్తే బోరు బావికి కనీసం 100 మీటర్ల దూరం మాత్రమే కొత్త బోరు వేయాలని నిభందనలు చెబుతున్నాయి. కానీ మైసమ్మగూడలో పరిస్థితులు చూస్తుంటే వాల్టా చట్టం ఉందా అని అనుమానాలు కలుగుతున్నాయి.
మైసమ్మగూడలో రోజుకో భవనం నిర్మాణం చేస్తూ ఎక్కడ చూసినా బోర్ల తవ్వకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటే వచ్చే తరాలకు నీటి కటకటా తప్పదనిపిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాల్టా చట్టం ఇలా..
నీరు, భూమి, వృక్షాల సంరక్షణకు రూపొందించిన ప్రత్యేక చట్టాన్ని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది. వాటర్ ల్యాండ్ ట్రీస్ ఆక్ట్ (వాల్టా)గా రూపొందించిన చట్టాన్ని పట్టించుకోవడం లేదు. ఈ చట్టం బోరు బావులకు సంబంధించిన అనేక నిబంధనలను తయారు చేసింది. ఎవరైనా సరే బోరు బావి తవ్వుకోవాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. సర్వే నంబరు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది బోరు వేసే ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తదుపరి ఆ అప్లికేషన్ను భూగర్భ జల వనరుల శాఖకు పంపుతారు.
అక్కడి టెక్నికల్ అధికారి సర్వే చేసి ఆ ప్రాంతం లో నీరు పడుతాయని దృవీకరిస్తే అప్పుడు బోరు వేసుకోవడానికి అనుమతినిస్తారు. ఒక వేళ బావిలో నీరు పడకపోతే ఆ బావిని పూర్తిగా పూడ్చివేయాలి. ఇంత పకడ్బందీగా వాల్టా చట్టం రూపొందించినప్పటికీ పలువురు పట్టించుకోవడం లేదు. ఇంట్లో వేసుకునే బోర్లకు సైతం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా బోర్ల తవ్వకాలు చేస్తున్న వారిపై రెవెన్యూశాఖ చర్యలు తీసుకుంటుంది.
