- అదృష్టాలు తెచ్చిపెడుతుంది..
- ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది..
మునగ చెట్టును వైద్య పరిభాషలో మిరాకిల్ ట్రీ అని పిలుస్తారు. అంటే అదృష్టాలను తెచ్చి పెట్టే చెట్టు అన్నమాట. పేరుకు తగినట్లుగానే ఈ చెట్టు ఆరోగ్యం రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. మునగాకుల్లో అత్యంత శక్తివంతమైన పోషకాలు నిండి ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇవి విస్తృతంగా గుర్తింపు పొందాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉండగా, మునగాకులోని విటమిన్ సి పరిమాణం నారింజ పండ్ల కంటే ఎక్కువగా, కాల్షియం పాల కంటే ఎక్కువగా ఉండటం ప్రత్యేకత. అందువల్ల ఇవి రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తాయి. పోషకాలతో నిండిన ఈ ఆకులు నిజంగా ఆహారంలో పెద్ద మార్పు తీసుకువచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
అంతేకాకుండా మునగాకు ఐరన్, ప్రోటీన్‌కు కూడా గొప్ప వనరుగా ఉండటం వల్ల భోజనంలో తప్పనిసరిగా ఉండాల్సిన పదార్థంగా మారింది. పోషక విలువలతోపాటు ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చాలా మందికి తెలియదు. రోజువారీ జీవితంలో మునగాకును చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని అనేక మార్గాల్లో మెరుగుపరచుకోవచ్చు. మునగాకు యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప వనరు. ఇందులో 46 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ ముఖ్యమైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. మునగాకును రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. తాజా లేదా పొడి మునగాకును స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. అరటిపండ్లు లేదా బెర్రీలతో కలిపితే రుచికరంగా ఉంటుంది. సూపులు, కూరలు లేదా స్టిర్-ఫ్రై వంటకాలలో చివర్లో కలిపితే పోషకాలు నిల్వ ఉంటాయి.
