- అభిమానులకు నిరాశ..
ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. గత మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్ వేదికగా ఆల్‌రౌండ్ ఆటతో గెలుపు బోణీ కొట్టిన సన్‌రైజర్స్.. సొంత మైదానంలో సూపర్‌జెయింట్స్ చేతిలో తడబాటుకు గురై అభిమానులను నిరాశకు గురిచేసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఆదివారం ‘లాస్ట్ ఓవర్ థ్రిల్లర్’గా సాగిన పోరులో లక్నోదే పైచేయి అయింది.
మొదట మహ్మద్ షమీ (2/9) అదిరిపోయే ఓపెనింగ్ స్పెల్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 156/9కే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 62, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (33 బంతుల్లో 56, 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఛేదనలో కెప్టెన్ రిషభ్ పంత్ (50 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు ఎయిడెన్ మార్క్మ్ (27 బంతుల్లో 45, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు తోడవడంతో ఛేదనను ఆ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. షమీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
29/4.. హెడ్ (7), అభిషేక్ (0), ఇషాన్ (1), లివింగ్‌స్టొన్ (14) వంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ 8 ఓవర్లలో చేసిన స్కోరిది! నిరుటి సీజన్ దాకా సన్‌రైజర్స్‌తో ఉండి ఈ సీజన్‌లో లక్నోకు ట్రేడ్ అయిన షమీ పేస్ పదునుకు ఆతిథ్య జట్టు విలవిల్లాడింది. తన తొలి ఓవర్లోనే అభిషేక్‌ను ఔట్ చేసిన అతడు.. రెండో ఓవర్ ఫస్ట్ బాల్‌కు హెడ్‌నూ పెవిలియన్‌కు పంపి ఆదిలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ను దెబ్బతీశాడు. మరుసటి ఓవర్లో ప్రిన్స్.. ఇషాన్‌ను బౌల్డ్ చేయగా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన లివింగ్‌స్టొన్‌ను దిగ్వేశ్ బోల్తా కొట్టించాడు.
షమీ వరుసగా 4 ఓవర్లు విసిరి 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో సన్‌రైజర్స్ 10 ఓవర్లకు చేసిన స్కోరు 35/4 మాత్రమే. ఆ స్థితి నుంచి హైదరాబాద్ ఈమాత్రం స్కోరైనా చేసిందంటే అది నితీశ్, క్లాసెన్ చలవే. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 63 బంతుల్లో 116 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ప్రిన్స్ 11వ ఓవర్లో చెరో సిక్స్ కొట్టిన ఈ ద్వయం బ్యాట్‌కు పనిచెప్పడంతో స్కోరువేగం పుంజుకుంది. అవేశ్ ఓవర్లో క్లాసెన్ నాలుగు ఫోర్లు బాదగా దిగ్వేశ్ ఓవర్లో నితీశ్ 3 సిక్స్‌లు కొట్టాడు. అయితే అర్ధ శతకాల తర్వాత ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో సన్‌రైజర్స్ మళ్లీ తడబడింది. లోయరార్డర్ కూడా బ్యాట్ ఝుళిపించలేకపోయింది.
