ఆనాటి అలుకు వాసాల ఇల్లు
అచ్చం ప్రకృతి వాకిల్లు!
సూరు రంధ్రాల్లో నుండి
సూర్యుడు టార్చ్ లైట్ వేసేవాడు
వాకిలి నిండా చందమామ
రాత్రికి వెన్నెల చాప పరిచేవాడు
ఆ వెన్నెల్లో తాతయ్య నానమ్మ చెప్పే
కథలు వింటూ నిదురపోతే
సూర్యుడు వచ్చి నిదుర లేపేవాడు
ఊరపిచ్చుకల కిచకిచలు కోడికూతలు
భూపాల రాగం పాడేవి
అలుకు పిడచ నేలను ముద్దాడితే
ఇల్లంతా మట్టి పరిమళాలే!
సేద బావి గిరకల గరగర సప్పుల్లు
బొక్కెన బుడబుడ మునుగుల్లు
రోజువారీ కాలచక్రం కదిలినట్లు!
కట్టెల పొయ్యి నిత్యాగ్నిహోత్రమే!
ఇంటి పెరట్లోని పూలతలు
సుగంధ సౌరభాలు వెదజల్లేవి!
వాసాలపై ఎలుకల సరసరలు
పిల్లి పాముల రుసరుస బుసలు
గోడ సందుల్లో ఇంగిళీకాలు, తేళ్ళు
నులకమంచంలో నల్లి దోమ కుట్లు
గుడ్డి దీపం వెలుగులో
రాత్రంతా శివరాత్రి జన జాగరణ యే!
వానాకాలం లో ఇల్లు ఉరుపులు
మెరిసి ఆరిపోయే మెరుపు సీరియల్లైట్లు
అన్ని కాలాల్లో ను విద్యుత్ లేకున్నా
ఎయిర్ కండిషనే! ఇల్లు ఇంద్రభవనమే!
ఇది అప్పటి అలుకు వాసాల ఇల్లు!
అలుకు వాసాల ఇల్లు
- Advertisement -
