- 11 మంది అభిమానులను స్మరించుకోనున్న ఆర్.సి.బీ.
ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. నిరుడు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది అభిమానులను ఆర్సీబీ స్మరించుకోనుంది. విజయోత్సవ యాత్రలో పాల్గొనేందుకు వచ్చి అసువులు బాసిన ఆ పదకొండు మంది అభిమానుల జ్ఞాపకార్ధం ప్రతి మ్యాచ్‌కు 11 సీట్లు రిజర్వ్ చేయాలని ఆర్సీబీ యాజమాన్యం, కర్నాటక క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకున్నాయి.
పంతొమ్మిదో సీజన్‌లో ఆరంభ పోరుకు మరో నాలుగు రోజులే ఉంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆడబోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. నిరుడు జూన్ 4వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం ప్రతి మ్యాచ్‌లో 11 సీట్లను రిజర్వ్ చేయాలని ఆర్సీబీ, కర్నాటక క్రికెట్ సంఘం భావిస్తున్నాయి. ఈ విషయాన్ని బెంగళూరు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇదివరకే ఆ 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన ఆర్సీబీ ఇప్పుడు మైదానంలో వారికి ప్రత్యేక గౌరవం కల్పించనుంది.
