Saturday, March 21, 2026
Homeకరీంనగర్మంగోల్ నుంచి భద్రాచలానికి గోటి తలంబ్రాలు

మంగోల్ నుంచి భద్రాచలానికి గోటి తలంబ్రాలు

  • గ్రామంలో భక్తుల ఊరేగింపు

భద్రాచలం సీతారాముల కళ్యానానికి అందించే గోటి తలంబ్రాల కార్యక్రమం కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం మంగోల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

భద్రాచలం నుండి తీసుకొచ్చిన గోటి తలంబ్రాలను కలశాలలో నింపి రామనామ స్మరణ చేస్తూ గ్రామ పురవీధుల గుండా కాషాయ జెండాలు, కలశాలతో భారీ ఊరేగింపుగా హనుమాన్ దేవాలయానికి తీసుకెళ్లారు. అనంతరం వడ్లను ఓలిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రామకోటి రామరాజు భక్తులతో కలిసి మూడు గంటల పాటు రామనామ స్మరణ చేయిస్తూ గోటితో వడ్లను ఓలిచి తలంబ్రాలుగా తయారు చేశారు.

- Advertisement -

తయారైన తలంబ్రాలను భక్తులు అక్కడే రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ, నాలుగోసారి భద్రాచలం సీతారాముల కళ్యానానికి తెలంగాణ రాష్ట్రం నుండి మూడు క్వింటాళ్ల గోటి తలంబ్రాలను అందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కర్ణాకర్ మాట్లాడుతూ, మంగోల్ గ్రామం నుండి భద్రాచలానికి గోటి తలంబ్రాలు తీసుకెళ్లడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘమని కొనియాడారు. భద్రాచలం వెళ్లలేకపోయినా, తమ గ్రామంలో తయారు చేసిన తలంబ్రాలు భద్రాచలం సీతారాముల కళ్యానానికి వెళ్లడం ఎన్నో జన్మల పుణ్యఫలమని అన్నారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు కరుణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ లగిశెట్టి రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నర్సింహారెడ్డి, బాల్ రాజ్, కనకయ్య, కర్ణాకర్ గౌడ్, వెంకటేశం తదితర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News