Homeఆదాబ్ ప్రత్యేకంNarayana Schools | ప్రభుత్వాన్ని శాసిస్తున్న నారాయణ విద్యాసంస్థ..!

Narayana Schools | ప్రభుత్వాన్ని శాసిస్తున్న నారాయణ విద్యాసంస్థ..!

  • నారాయణ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న అధికారులు..
  • విద్యాశాఖను భ్రష్టుపట్టిస్తున్న కొందరు అవినీతి ఉద్యోగులు..
  • రాజకీయ పలుకుబడికి దాసోహం అంటున్న వ్యవస్థలు..
  • సీజ్ చేయాలని ఆదేశాలున్నా మీనమేషాలు లెక్కబెడుతున్న వైనం..
  • మాదాపూర్ లో విచ్చలవిడిగా నడుస్తున్న నారాయణ స్కూల్స్.
  • నారాయణను టచ్ చేయాలంటే ప్రభుత్వం వెనుకంజ వేస్తోందా..?
  • ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు..
  • జనం తిరగబడితే నారాయణే కాదు ఇంకెవరైనా తోక ముడచాల్సిందే..

ఒక మనిషి జీవితపు చివరి అంకంలో ఉన్నప్పుడు నారాయణ.. నారాయణ అని పఠించమంటారు.. పోతున్న ప్రాణం తిరిగి వస్తుందని అపారమైన నమ్మకం.. నారాయణ అన్న పాదంలో అవ్యాజమైన శక్తి దాగివుంటుందని పెద్దలు భావిస్తారు.. అలాంటి శక్తివంతమైన పేరుతో నడిచే నారాయణ పాఠశాలలు అక్రమాలకు నిలయంగా మారిపోయాయి.. నారాయణ విద్యాసంస్థల యజమాని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి అన్నది జగమెరిగిన సత్యమే.. ఆయన ప్రజానాయకుడు కూడా..

అలాంటి వ్యక్తి చట్టానికి లోబడి ఉండాలి.. ఒక పెద్ద స్థాయిలో వున్న వ్యక్తి గతి తప్పితే ఆయనను ఫాలో అవుతున్నవారు కూడా గతితప్పుతారు.. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే.. నారాయణ విద్యాసంస్థలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.. ఒక పదవిలో ఉన్నవారు ప్రైవేట్ గా స్కూల్స్ నడపకూడదని ఎవరూ అనడం లేదు.. కానీ అత్యున్నత పదవులు అనుభవిస్తూ చట్టాలను పట్టించుకోకుండా.. నిబంధనలను ఖాతరు చేయకుండా పవిత్రమైన విద్యా సంస్థలను నడపడం అన్నది దురదృష్టం..

- Advertisement -
Narayana Schools Operating Without Permission In Madhapur1

ఆయనకున్న పలుకుబడి, హోదా, పదవులు చూసి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆయన అడుగులకు మడుగులు ఒత్తడం, ప్రభుత్వ పెద్దలు కూడా ఆయనకు ఊడిగం చేయడం అన్నది ఇక్కడ సమస్య.. ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్స్ నడపడం ఒకెత్తయితే.. అధిక ఫీజులు వసూలు చేయడం.. ముందస్తు అడ్మిషన్లు చేసుకోవడం, స్కూల్స్ లో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం..

ఇవన్నీ నిరాటంకంగా కొనసాగుతుండడం దేనికి సంకేతం.. డబ్బు, హోదా, పలుకుబడి ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అనే భావనలు అందరిలో నెలకొంటున్నాయి.. సామాన్యులపట్ల కఠినంగా వ్యవహరించే ప్రభుత్వాధికారులు నారాయణలాంటి బడా బాబుల వద్ద ఎందుకు లొంగిపోతున్నారు..? అన్నదే ప్రశ్న.. సామాన్యులకు ఒక న్యాయం.. పెద్దలకు ఒక న్యాయం.. ఇదేనా సమసమాజమంటే..? మాదాపూర్ ప్రాంతంలో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలు చేస్తున్న నిర్వాకం మీకోసం..

Narayana Schools Operating Without Permission In Madhapur12

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ ప్రాంతంలో నారాయణ స్కూల్స్ పై జిల్లా విద్యా శాఖ, మండల విద్యాశాఖ అధికారులు సీజ్ ఆర్డర్ ప్రకారం సీజ్ చేయకుండా నాలుగు స్కూళ్ళు అంటే నారాయణ కో-స్కూల్, నారాయణ వారాహి క్యాంపస్, నారాయణ కే.కే. క్యాంపస్, నారాయణ ది వన్ స్కూల్ అనే నాలుగు విద్యాసంస్థలు చట్టబద్ధ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు.. ఇందులో కేవలం రెండు స్కూళ్లను సీజ్ చేసి మరో రెండు స్కూళ్లను వదిలేయడం వెనుక ఉన్న లాజిక్ ఏమిటో అర్ధం కావడం లేదు..

పైగా మండల విద్యాశాఖాధికారి మాట్లాడుతూ మిగిలిన రెండు స్కూళ్లను తరువాత సీజ్ చేస్తామని చెప్పడం గమనార్హం.. ఇది తీవ్రమైన పరిపాలనా వైఫల్యంగా స్థానికులు భావిస్తున్నారు.. అంతే కాకుండా సీజ్ చేసిన స్కూల్స్ కి ఒక లక్ష రూపాయలు ఫైన్ విధించడమే కాకుండా.. పాఠశాల నడిపినన్ని రోజులు రోజుకి రూ. 10,000 చొప్పున వసూలు చేయాలి.. మరి ఇక్కడ ఇది జరిగిందా..? అన్నది అధికారులు వెల్లడించలేదు.. పైగా అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన పాఠశాల భవనాలను ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేసే అధికారం అధికారు లకు ఉంటుంది..

Narayana Schools Operating Without Permission In Madhapur01

మరి ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు అన్నది అంతుబట్టని విషయంగా మారింది.. నిబంధ నలను అతిక్రమించడమే కాకుండా.. ప్రభు త్వానికి అందాల్సిన పైకం కూడా అంద కుండా అడ్డుపడుతున్న కొందరు అవినీతి అధికారులపై ఎలాంటి చర్యలు తీసు కుంటారు..? అన్నది కూడా వెల్లడికావాల్సి ఉంది.. కాగా ఇంతకు మునుపు నిబంధనలు అతిక్రమించిన ఒక కార్పొరేట్ కాలేజీని పూర్తిగా మూసేసిన సందర్భం ఉంది.. కానీ ప్రస్తుతం నారాయణ కాలేజీ నాలుగు స్కూళ్లలో రెండు స్కూళ్లను అంటే నారాయణ వారాహి క్యాంపస్, నారాయణ కే.కే. క్యాంపస్ లను అతి బలవంతంగా మూసివేతపై ఎదురైన వత్తిళ్లు ఏమిటి..?

నారాయణ కో-స్కూల్, నారాయణ ది వన్ స్కూల్ లను ఎప్పుడు సీజ్ చేస్తారు తెలియాల్సి ఉంది.. ఇకపోతే మిగతా పాఠశాలల కు నారాయణ పాఠశాలలకు ఉన్న వ్యత్యాసం ఏమిటి..? నారాయణ విద్యాసంస్థలకు ఏదైనా ప్రత్యేక చట్టం ఉందా..? అన్నది తెలియాల్సివుంది..ఈ ఘటన శేరిలింగంపల్లి మండల పరిధిలో వెలుగు చూసింది.. ఇంత జరుగుతున్నప్పటికీ.. బాధ్యత వహించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు మిగిలిన రెండు పాఠశాలలను సీజ్ చేయడంలో, ఉన్నతాధికారుల ఆర్డర్ అమలు చేయడంలో విఫలమవడం ప్రజల్లో తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది.రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 – సెక్షన్ 18, 19 ప్రకారం అవసరమైన గుర్తింపు లేకుండా పాఠశాల నడపడం చట్టవిరుద్ధం.

Narayana Schools Operating Without Permission In Madhapur01.jpg0

అలాగే ఇండియన్ పీనల్ కోడ్ – సెక్షన్ 188 ప్రకారం ప్రభుత్వ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం. ఇండియన్ పీనల్ కోడ్ – సెక్షన్ 217 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన విధులను ఉద్దేశపూర్వకంగా నిర్వర్తించకుండా నేరస్తుడికి లాభం చేకూర్చడం. ఇండియన్ పీనల్ కోడె – సెక్షన్ 120 బీ ప్రకారం అక్రమ కార్యకలాపాలకు సహకరించడం తీవ్రమైన నేరం.. ఈ సెక్షన్ల ప్రకారం బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే పూర్తి హక్కు ప్రజలకు ఉంది. అందుకనే స్థానికులు అధికారులకు బహిరంగ హెచ్చరిక చేస్తున్నారు.. సీజ్ ఆర్డర్ జారీ చేసినప్పటికీ అమలు చేయకపోతే ఉదృతంగా చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది.

సంబంధిత డీఈఓ, ఎం ఈ ఓ లపై వ్యక్తిగత బాధ్యత ఫిక్స్ చేసి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తాము. మొత్తం వ్యవహారాన్ని తెలంగాణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం.. అధికారుల పాత్రపై అవినీతి కోణంలో విచారణ కోరడం.. అక్రమంగా స్కూల్ నడిపిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.. కావున విద్యా శాఖ అధికారులు ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలి.. ప్రభుత్వ ఆదేశాలు అమలు కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ప్రభావం చూపుతుంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం.

Narayana Schools Operating Without Permission In 0

చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. “సీజ్ ఆర్డర్ అమలు చేయకపోతే అది అధికార దుర్వినియోగం మాత్రమే కాదు.. చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్టే.”అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమంగా నడుస్తున్న స్కూళ్లను సీజ్ చేయాలి.. అలాగే స్కూళ్ల యజమానులు నుండి దాదాపు తొమ్మిది లక్షల పైచిలుకు జరిమానా వసూలు చేయడంతో పాటు అక్రమంగా నిర్మించిన స్కూల్ బిల్డింగ్స్ ను తొలగించాలని..

లేనిపక్షంలో ఈ అంశాన్ని హైకోర్టు, విజిలెన్స్, ఇతర విచారణ సంస్థల ముందు తీసుకెళ్లి పూర్తి స్థాయి విచారణ కోరుతామని వారు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మేల్కోవాలి. ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ వ్యవస్థను శాసించే స్థాయికి చేరిందంటే, అది పరిపాలనా వైఫల్యానికి పరాకాష్ట. తక్షణమే ఆ అక్రమ పాఠశాలను సీజ్ చేసి, చట్టం ఇంకా బతికే ఉందని నిరూపించాలి. లేనిపక్షంలో, జనాగ్రహం ముందు నారాయణే కాదు, అధికారుల కుర్చీలు కూడా గడగడలాడక తప్పవు అని మేధావులు హెచ్చరిస్తున్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News