ఒకప్పుడు ఓపెన్ సర్జరీ కోసం రోగి శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టాల్సి వచ్చేది. అందువల్ల రక్తస్రావం అధికంగా జరిగేది. శరీరంపై పెద్ద గాయం చేయాల్సి వచ్చేది. అంతర అవయవాల్లోనూ గాయం అయ్యేది. ఈ విధానంలో నొప్పి కూడా ఎక్కువే. గాటు పెట్టిన చోట కుట్లు వేసి మూసివేయాల్సి ఉంటుంది. ఆ కుట్లు ఆరడానికి కొంత కాలం పట్టేది. రోగి కోలుకునేదాక దవాఖానలో ఉండాల్సి వచ్చేది. సర్జరీ కోసం చేసిన గాయం కొందరిలో ఇన్‌ఫెక్షన్‌కు దారితీసేది.
ఇది కూడా ప్రమాదకరమైనదే. రోగం నయమైనా గాయం మానడానికి కొంతకాలం పట్టేది. సుదీర్ఘమైన విధానం కావడం వల్ల రోగి కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది. వైద్యరంగంలో ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందడం వల్ల శస్త్రచికిత్సా పద్ధతుల్లోనూ పెను మార్పులు వచ్చాయి. ఓపెన్ సర్జరీకి ప్రత్యామ్నాయంగా ల్యాపరోస్కోపిక్ సర్జరీ వచ్చింది. ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టాల్సిన అవసరం తప్పింది. చిన్న రంధ్రాలు చేసి, వాటి ద్వారా శరీరంలోపల రోగం బారినపడిన అవయవానికి సర్జరీ చేస్తారు.
ఈ ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో ఓపెన్ సర్జరీలో చేసినట్టుగా చేతివేళ్లతో సులభంగా సర్జరీ చేయలేరు. ల్యాపరోస్కోపి పరికరాలకు చేతివేళ్లకు ఉన్న సౌలభ్యం ఉండదు. కాబట్టి అన్ని రకాల శస్త్రచికిత్సలను ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో చేయడం సాధ్యం కావట్లేదు. ఇరుకుగా, సున్నితమైన అవయవాలు, శరీర భాగాల్లో (గొంతు, ఛాతీలోపల, ఊపిరితిత్తులు, గుండె పక్కన) సమస్య ఉంటే ల్యాపరోస్కోపిక్ సర్జరీ చేయడం కష్టం. కాబట్టి ఆ అవయవాలకు సులభంగా చికిత్స చేయడానికి రోబోటిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది.
