- ఆరోగ్యానికి ఏది ముఖ్యమో తెలుసా..?
వ్యాయామం చేయడానికి ముందు, చేసిన తరువాత అలాగే కొన్ని సందర్భాల్లో శరీరానికి తక్షణ శక్తి అవసరమవుతుంది. తక్షణ శక్తి అవసరమైన సందర్భాల్లో చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చేవి అరటిపండ్లు, ఖర్జూరాలు. ఇవి సరసమైన ధరల్లో లభించడంతో పాటు తీసుకువెళ్లడం కూడా చాలా సులభం. ఇవి కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. శరీరం శక్తి కోసం వీటిని గ్లూకోజ్ గా మారుస్తాయి. దీంతో మనకు తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ఖర్జూరం, అరటిపండ్లల్లో తక్షణ శక్తి ఇవ్వడంలో ఏవి బాగా పని చేస్తాయి. శక్తి వేటిలో ఎంత త్వరగా విడుదల అవుతుంది, శక్తి ఎంతకాలం ఉంటుంది..?
ఖర్జూరాలు చిన్నవిగా ఉంటాయి. కానీ చాలా శక్తి వంతంగా పనిచేస్తాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు వీటిలో అధికంగా ఉంటాయి. ఇవి నీటి శాతాన్ని తక్కువగా కలిగి ఉంటాయి. కనుక పోషకాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కనుక శరీరం వీటిని త్వరగా గ్రహిస్తుంది.
అలాగే అరటిపండ్ల విషయానికి వస్తే ఇవి సమతుల్య శక్తిని అందిస్తాయి. ఇవి అందించే శక్తి ఎక్కువ కాలం పాటు ఉంటుంది. అరటిపండ్లు సాధారణ, సంక్లిష్ట కార్బొహైడ్రేట్ల మిశ్రమం. వీటిలో నీటి శాతం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. వ్యాయామానికి 30 నుండి 60 నిమిషాల ముందు వీటిని తీసుకోవడం మంచిది.
రెండూ మంచివే :
సహజ చక్కెరలు ఖర్జూరాల్లో అధికంగా , అరటిపండ్లల్లో మధ్యస్థంగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఖర్జూరాల్లో తక్కువగా, అరటిపండ్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. అరటిపండ్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. వ్యాయామం చేసే ముందు, వ్యాయామం చేసే సమయంలో తీసుకోవడానికి ఖర్జూరాలు అనువుగా ఉంటాయి. వ్యాయామానికి గంట ముందు తీసుకోవడానికి అరటిపండ్లు అనువుగా ఉంటాయి.
