- ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేసే అధికారులే కావాలి
- బడ్జెట్ లేక ఐటీడీఏలు రెక్కలు విరిగిన పక్షిలా మారింది
- క్షేత్ర పర్యటనలు చేయకుండా అధికారులు గెస్ట్ హౌస్కే పరిమితం
- సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు అమలు కావడంలేదు
- నిర్లక్ష్యంతో గిరిజనుల అభివృద్ధి వెనుకబడుతోంది
- తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి ఆందోళన, ఆవేదన
ములుగు జిల్లా ఐ.టి.డి.ఏ ఐటీడీఏలో పరిపాలనా వ్యవస్థ గత కొంతకాలంగా పూర్తిగా నిర్వీర్యమైందన్న ఆరోపణలతో ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు అధికారిణి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఏటూరునాగారం తుడుందెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి బుధవారం మాట్లాడుతూ…
ఐటీడీఏ పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిమ తెగల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, జీవోలు అమలులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఐటీడీఏలు తమ ప్రాధాన్యతను కోల్పోయి బడ్జెట్ కేటాయింపులు లేక రెక్కలు విరిగిన పక్షిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐటీడీఏలు 29 శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసేవని, ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యంతో ఆదివాసీల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.
క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులు
ప్రాజెక్టు అధికారి సమయానికి కార్యాలయానికి రాకపోవడం, సిబ్బంది కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల పరిపాలన పూర్తిగా దెబ్బతింటోందని మండిపడ్డారు. అధికారులు హెడ్క్వార్టర్స్ లో ఉండకుండా పట్టణాల నుండి రాకపోకలు సాగించడం గిరిజనుల సమస్యల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోందన్నారు. ప్రాజెక్టు అధికా కార్యాలయానికి రావడం కంటే గెస్ట్ హౌస్ కు మాత్రమే పరిమితమవుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ జీవో ప్రకారం ప్రాజెక్టు అధికారి నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఐదు రోజులు గ్రామాల్లో బస చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల గిరిజనుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి చేరడం లేదని తెలిపారు.
ఐటీడీఏ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీడీఏల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదని, గిరిజనుల అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేసి, సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఐటీడీఏలను బలోపేతం చేసి, గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఈసం పణికుమార్, పిట్టల నాగేశ్వరావు, చాట్ల విజయ్, బొగ్గం శివకుమార్, చింత లక్ష్మణ్ స్వామి, పలక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
