- మా సపోర్ట్ లేకుండా కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలిచిందా..?
- ఏ రెడ్డి అయినా, ఏ రావు అయినా మా దగ్గరికి రావాల్సిందే
- మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా ఏమిటో చూపిస్తాం..
- సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం స్టార్ క్యాంపెయినర్ అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ వేదికగా తనదైన శైలిలో విమర్శల గళం విప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కింగ్ మేకర్ గా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయన్నారు.. ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము ముఖ్యమంత్రుల దగ్గరకు వెళ్లాల్సిను అవసరం లేదు.
పనులు కావాలన్నా, అధికారం కావాలన్నా ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది రెడ్డి అయినా, రావు అయినా ఎవరైనా సరే.. మా మద్దతు లేకుండా రాజకీయం చేయడం సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం మద్దతు అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమకుందని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపును అక్బరుద్దీన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు లేనిదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారా? అని ఆయన ప్రశ్నించారు. అక్కడ కాంగ్రెస్ కు వచ్చిన విజయంలో ఎంఐఎం పాత్ర కీలకమని, ఆ విషయాన్ని వారు మర్చిపోకూడదని పరోక్షంగా హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి తమ అవసరం ఎప్పుడూ ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపారు.
