- బీఆర్ఎస్–బీజేపీ డబుల్ గేమ్ పాలిటిక్స్ ?
ఒకప్పుడు వినిపించిన సామెత ఒకటి ఉంది…! “నేను గుచ్చినట్టు చేస్తా… నువ్వు ఏడ్చినట్టు చేయి” అనే ఈ సామెత తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ – బీజేపీ పార్టీలకు అచ్చుగుద్దినట్టే సరిపోతోంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు సామాన్య ప్రజలకే కాదు…స్వయంగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులనే అయోమయానికి గురిచేస్తున్నాయి.బయటకు మాత్రం బీఆర్ఎస్ – బీజేపీ మధ్య కుస్తీ.కానీ తెర వెనుకమాత్రం విడదీయరాని బంధం పెనవేసుకుందనేది కనిపించని వాస్తవం…బీజేపీ బీఆర్ఎస్ తో ఎందుకు జత కట్టాలని చూస్తోంది..అంటే చాలా జవాబులు కనిపిస్తున్నాయి..నిజానికి తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాంగ్రెస్‌ను ఎదుర్కోనే శక్తి లేదు..?
దానికి ప్రజల్లో బలమైన సంస్థాగత వ్యవస్థ కూడా కావాలి.. రాష్ట్రస్థాయి నాయకత్వం గట్టిగా లేకుండా, కేవలం కేంద్రంలోని అధికారంతో తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించడం బీజేపీకి సాధ్యమయ్యే పని అసలే కాదు.అందుకే బీజేపీకి ఒక ప్రాంతీయంగా బలమైన పార్టీ అవసరం ఏర్పడింది.అది ఎవరు? అంటే స్పష్టమైన సమాధానం బీఆర్ఎస్… బీఆర్ఎస్‌కు కూడా రాజకీయ అవసరాలు ఉన్నాయి.అధికారంలో లేని పరిస్థితిలో కేసుల భయం…దర్యాప్తుల ఒత్తిడి…కేంద్ర సంస్థల అనిశ్చితి…ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు కావలసింది ఏమిటి? అంటే కేంద్రం నుంచి రక్షణ.కేసుల నుంచి ఊరట.రాజకీయంగా మళ్లీ ఊపిరి పీల్చుకునే అవకాశం.ఇలా రెండు పార్టీల అవసరాలు ఒకే చోట కలిశాయి.బీజేపీకి కాంగ్రెస్‌ను ఓడించడానికి బీఆర్ఎస్ అవసరం.బీఆర్ఎస్‌కు రాజకీయ రక్షణ కోసం బీజేపీ అవసరం.అక్కడే మొదలైంది దోస్తీ..
కాళేశ్వరం: జాతీయ అంశం ఎందుకు కాలేదు?..
దేశంలో చిన్న చిన్న ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలకే ఈడీ దాడులు, సీబీఐ కేసులు, రాజకీయ భూకంపాలు చూశాం. వందల కోట్లు కాదు… వేల కోట్లు కూడా కాదు… కేవలం పదుల కోట్లు ఖర్చైన పనులపైనే కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు చూపిన ఉదాహరణలు కోకొల్లలు.అయితే వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం మెగా ప్రాజెక్ట్ విషయంలో మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయో అర్ధం కావడంలేదు..?..ప్రాజెక్ట్ వ్యయంపై తీవ్రమైన సందేహాలు…నాణ్యతపై నిపుణుల ప్రశ్నలు…బ్యారేజీల నిర్మాణ లోపాలపై బహిరంగ చర్చ…ఇవన్నీ వెలుగులోకి వచ్చినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతొ ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం వెనుక అసలు కారణం ఏమిటి?
అసెంబ్లీ సాక్షిగా చేసిన విజ్ఞప్తి… అయినా కేంద్ర మౌనం!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ చేపట్టమని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రకటన కాదు. ప్రజల ముందు, శాసనసభ వేదికగా, రాజ్యాంగబద్ధంగా చేసిన విజ్ఞప్తి. కానీ ఆ విజ్ఞప్తికి కేంద్రం నుంచి ఏమి స్పందన వచ్చింది? అంటే ఏదీ లేదు.. సరికదా..విచారణ చేస్తామని ముందుకు రావడం లేదు…దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపడం లేదు…కనీసం ఒక స్పష్టమైన ప్రకటన కూడా ఇవ్వడం లేదు..రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విచారణ కోరిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోతే,అది కేవలం రాజకీయ మౌనం కాదు…అది రాజ్యాంగ వ్యవస్థల పట్ల అవహేళనగా చూడాల్సిందే..
ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా,ప్రజాస్వామ్య విలువలను కూడా తక్కువ చేయడమే ఈ వైఖరి.వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చైన మెగా ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోరితే, కేంద్రం దర్యాప్తు చేసి అవినీతి జరిగిందా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది.అది చేయకుండా మౌనం వహించడం అంటే..ప్రజలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడమే..రాజకీయ అవసరాల కోసం చట్టాన్ని పక్కన పెట్టడమే..ఈ మౌనం కొనసాగుతున్నంత కాలం,కాళేశ్వరం అంశం కేవలం ఒక ప్రాజెక్ట్ వివాదంగా కాదు… కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లోని వైఫల్యానికి, రాజకీయ కుమ్మక్కుకు నిదర్శనంగా మారుతుంది.ఇకనైనా కేంద్రం స్పందించాలి.విచారణ చేయాలి.నిజం బయట పెట్టాలి.లేకపోతే ఈ మౌనం..ప్రజాస్వామ్యానికి చెల్లించాల్సిన భారీ మూల్యం అవుతుంది..
టీడీపీ – బీజేపీ కథ: నిన్నటి చరిత్ర… నేటి హెచ్చరిక
రాజకీయాల్లో నిన్న జరిగిందే రేపు మళ్లీ జరుగుతుందన్నది కేవలం ఊహాగానం కాదు. ఇది భారత రాజకీయాల స్వభావం.ఇక్కడ రాజకీయ శత్రుత్వాలు శాశ్వతం కావు… మిత్రత్వాలు సిద్ధాంతాల మీద కాకుండా అవసరాల మీద ఆధారపడతాయి.ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు వరకూ బీజేపీ – టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో సాగింది.“అంటీముట్టనంటూ” బీజేపీ చేసిన వ్యాఖ్యలు పత్రికల పతాక శీర్షికల్లో అచ్చువేయబడ్డాయి.
ఒకరిపై ఒకరు ఆరోపణలు…సూత్రాల పేరుతో విమర్శలు…అయితే సీన్ కట్ చేస్తే..ఎన్నికల వేళ ఏమైంది?.అదే బీజేపీ…
అదే టీడీపీ…అనూహ్యంగా చేతులు కలిపి మహా కూటమిగా మారాయి..ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి.అధికారాన్ని కైవసం చేసుకున్నాయి.నిన్నటిదాకా శత్రువులుగా చిత్రీకరించిన పార్టీలే..ఈ రోజు మిత్రులయ్యాయి.ఇది రాజకీయాల్లో సాధారణమని కొట్టిపారేయాలా?.లేదా దీని వెనుక దాగున్న వ్యూహాన్ని గమనించాలా? ఏపీలో అమలైన ఈ మోడల్ తెలంగాణలో రిపీట్ కానుందా? బయట మాటల కుస్తీ…లోపల అవసరాల దోస్తీ…ఎన్నికల వేళ మాత్రం చేతులు కలిపే వ్యూహం…ఈ పరిణామాలన్నీ చూస్తే,తెలంగాణలో కూడా బీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఇదే రాజకీయ స్క్రిప్ట్ రచించబడుతోందా? అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
2029: ఇరుపార్టీల లక్ష్యం… కాంగ్రెస్‌ను ఓడించడమేనా?
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటోంది. ఎన్నో ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఒక దిశ, ఒక స్వరం, ఒక కూటమి కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. జాతీయంగా ఇండియా కూటమి చర్చల్లో కీలక పాత్ర పోషిస్తోంది.ఈ పరిణామాలు బీజేపీకి పెద్ద రాజకీయ సవాల్‌గా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.నిజానికి తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాంగ్రెస్‌ను ఎదుర్కోగలదా? అంటే స్పష్టమైన సమాధానం కష్టం..ప్రజల్లో బలమైన సంస్థాగత వ్యవస్థ లేకుండా, రాష్ట్రస్థాయి నాయకత్వం గట్టిగా లేకుండా, కేవలం కేంద్రంలోని అధికారంతో తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించడం బీజేపీకి సాధ్యమయ్యే పని కాదు.అందుకే బీజేపీకి ఒక ప్రాంతీయంగా బలమైన పార్టీ అవసరం ఏర్పడింది.అది ఎవరు? అంటే స్పష్టమైన సమాధానం బీఆర్ఎస్…బీఆర్ఎస్‌కు కూడా రాజకీయ అవసరాలు చాలానే ఉన్నాయి.అధికారంలో లేని పరిస్థితిలో కేసుల భయం…
దర్యాప్తుల ఒత్తిడి…కేంద్ర సంస్థల అనిశ్చితి…ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు కావలసింది ఏమిటి? అంటే కేంద్రం నుంచి రక్షణ.కేసుల నుంచి ఊరట.రాజకీయంగా మళ్లీ ఊపిరి పీల్చుకునే అవకాశం.ఇలా రెండు పార్టీల అవసరాలు ఒకే చోట కలిశాయి.బీజేపీకి కాంగ్రెస్‌ను ఓడించడానికి బీఆర్ఎస్ అవసరం.బీఆర్ఎస్‌కు రాజకీయ రక్షణ కోసం బీజేపీ అవసరం.అక్కడే మొదలైంది దోస్తీ..2029 లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ ప్రయాణంలో పోరు కాంగ్రెస్‌తోనా? లేదా ప్రజల విశ్వాసంతోనా? కాలమే సమాధానం చెప్పాలి. కానీ ఇప్పటికైతే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది..ఇది ఒంటరి పోరాటం కాదు… ఇది అవసరాలపై నిర్మించిన రాజకీయ దోస్తీ…
