- మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి
- మూడో విడతలోనూ కాంగ్రెస్ ఆధిక్యం
- కాంగ్రెస్‌కి 2219 సర్పంచ్ పదవులు
- బలమైన ప్రతిపక్షంగా పోటీ ఇచ్చిన బీఆర్ఎస్
- బీఆర్ఎస్కి 1147 చోట్ల విజయం..
- 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం
- పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా ముగించిన ఎన్నికల సంఘం ..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలిచారు. ఒకటీ రెండు దశల్లో పైచేయి సాధించిన అధికార పార్టీ.. మూడో దశలో తిరుగులేని ఫలితాలను సొంతం చేసుకుంది. మొత్తం 3752 స్థానాల్లో ఎలక్షన్లు జరగ్గా అధిక చోట్ల కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉన్న క్యాండేట్లే ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీ వాలతో కలిపి 2219 సర్పంచ్ పదవులను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 1147 చోట్ల విజయం నమోదు చేసింది. బీజేపీ 240, ఇతరులు 488 సర్పంచ్ స్థానాల్లో గెలిచారు. మూడో దశలో 182 మండలాల్లో 4159 గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రకటన వెలువడగా 11 చోట్ల నామినేషన్లు వేయలేదు.
394 స్థానాల్లో పోటీ లేకుండా నెగ్గారు. రెండు చోట్ల ఎలక్షన్లను కోర్టు నిలిపివేసింది. మిగతా 3752 ప్రెసిడెంట్ పదవులకు బుధ వారం ఓటింగ్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, హనుమ కొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్ పల్లి, మహబూబాబాద్, మహ బూబ్‌నగర్, మంచి ర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామా బాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఉదయం 7 నుంచి 1 గంటవరకు పోలింగ్ జరగగా, 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. పలు గ్రామాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు దశలతో పంచాయితీ సమరం ముగిసింది. గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. ఈ నెల 22న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణం చేస్తారు.
దీంతో గ్రామాల్లో పాలన ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు 80.78శాతం పోలింగ్ నమోదయ్యింది. సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే, తదుపరి పక్రియగా ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్ ఫలితం తేలిన తర్వాత, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేసారు.
