- 58 అడుగుల విగ్రహం ఏర్పాటు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందులో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్థంతి సందర్భంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు పోరాడారని తెలిపారు. ఆయన ఆత్మార్పణంతో రాష్ట్రం రగిలిపోయిందని గుర్తు చేశారు. తెలుగుజాతి గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుజాతి కోసం జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి ఆయన అని కొనియాడారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాటం చేశారన్నారు. తన పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. 1952లో మద్రాస్లోని బలుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి చనిపోయారు. నమ్మిన సిద్దాంతం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారు. ఆయన మృతితో తెలుగు తమ్ముళ్లు బయటకు వచ్చి పోరాడారు. దీంతో తెలుగువాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని అప్పటి ప్రధాని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన రోజును స్మరించుకుంటున్నాం. త్యాగం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం.
దీని కోసం 6.8 ఎకరాలు కేటాయించాం. 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచిన భవనాన్ని స్మారక కేంద్రంగా మారుస్తాం. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు.. తెలుగు ప్రజల ఆస్తి అని చంద్రబాబు అన్నారు. ఇదిలావుంటే అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం పోరాడారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అని సీఎం తెలిపారు. ఆ మహనీయుడు ప్రాణ త్యాగ ఫలమే ఈ రోజు మనకున్న భాషాప్రయుక్త రాష్ట్రాలన్ని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
