Friday, February 13, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంArrears | టెండర్ ధాన్యం బకాయి మిల్లర్లపై మెతక వైఖరి

Arrears | టెండర్ ధాన్యం బకాయి మిల్లర్లపై మెతక వైఖరి

  • సూర్యాపేట జిల్లాలో ఉన్న 58 మంది మిల్లర్ల బకాయి రూ. 226 కోట్లు..
  • హైకోర్టులో కేసులు నడుపుతున్న పలువురు మిల్లర్లు చేల్లించాల్సింది రూ.300 కోట్లు!
  • టాప్‌ టెన్‌ బకాయి మిల్లర్ల వద్దనే 150 కోట్లు.. 3 ఏళ్ళు గడుస్తున్నా సెటిల్మెంట్‌ చేయని వైనం..
  • సివిల్‌ సప్లయ్‌ మంత్రి సొంత జిల్లాలోనే భారీ బకాయిలు..
  • ప్రస్తుత సీజన్లో మళ్ళీ వీళ్ళకే సి.ఎమ్‌.ఆర్‌ ధాన్యం కేటాయించిన దుస్థితి..

రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ శాఖ ద్వారా గ్లోబల్‌ టెండర్‌ విధానంలో సరఫరా చేసిన ధాన్యానికి సంబంధించిన కోట్ల రూపాయల బకాయిలు సూర్యాపేట జిల్లాలో పేరుకుపోయాయి. కానీ, ఈ బకాయిల వసూలుపై ప్రభుత్వం, శాఖాధికారులు చూపుతున్న నిర్లక్ష్యం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అధికారుల ఉదాసీనత వలన ఇక్కడున్న కొద్దిమంది మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను భేఖాతర్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సూర్యాపేట జిల్లాలో 2022 సంవత్సరానికీ చెందిన గ్లోబల్‌ టెండర్‌ ద్వారా ధాన్యం తీసుకున్న 58 మంది రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి గడిచిన జూన్‌ 30 వరకు అధికారిక లెక్కల ప్రకారం ఇంకా రూ.226 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు గత మూడు సంవత్సరాలుగా పెండిరగ్‌లోనే ఉండగా, వాటి వసూలుకు సరైన చర్యలు లేకపోవడం గమనార్హం.

- Advertisement -

హైకోర్టులో కేసులు నడుపుతున్న
ఇరువురు మిల్లర్లు చేల్లించాల్సింది రూ.300 కోట్లు!

ఇక మరోవైపు, హైకోర్టులో కేసులు నడుపుతున్న కేవలం ఇద్దరు మిల్లర్ల నుండి సుమారు రూ.300 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. చట్టపరమైన వివాదాల పేరుతో చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలూ, వేగవంతమైన రికవరీ చర్యలూ కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఇద్దరి మిల్లర్లను గమనించిన మరి కొద్ది మంది మిల్లర్లు సైతం వీళ్ళను అనుసరిస్తే తప్పేంది? అన్నట్లుగా వ్యవహారశైలి కనిపిస్తోంది. కోట్లలలో తమ వద్ద పేరుకుపోయిన 2022 సంవత్సరానికీ చెందిన గ్లోబల్‌ టెండర్‌ ద్వారా ధాన్యం బకాయిలు తాము కూడా ఎగవేస్తే, ప్రభుత్వం చేసిది ఏముంది? తమపై వత్తిడి పెంచితే తాము కూడా హైకోర్టుకు వెళతాం..! అన్న రీతిగా జిల్లాలో ఉన్నా ఓ 10 మంది టాప్‌ బకాయి మిల్లర్ల వ్యవహారం వారి బకాయిల జాబితాను బట్టి తెలుస్తోంది.

టాప్‌ టెన్‌ బకాయి మిల్లర్ల వద్దనే 150 కోట్లు..
3 ఏళ్ళు గడుస్తున్నా సెటిల్మెంట్‌ చేయని వైనం..

అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, టాప్‌ టెన్‌ బకాయి మిల్లర్ల వద్దనే సుమారు రూ.150 కోట్ల బకాయిలు కేంద్రీకృతమై ఉండటం. వీరిలో చాలా మంది మిల్లర్లు మూడు సంవత్సరాలుగా వాటిని సెటిల్మెంట్‌ చేయకుండా నాన్చుతూ, యథావిధిగా ప్రభుత్వంతో సీజనల్‌ గా సి.ఎమ్‌.ఆర్‌ వ్యాపారం కొనసాగిస్తున్నారని సమాచారం. ప్రభుత్వం అడిగినప్పుడల్లా లక్షల్లో చెల్లిస్తూ, కోట్ల రూపాయల బకాయిలు అట్లాగే దాచుకుంటున్నారు. గడిచిన జూన్‌ 30 వరకు 2022 సంవత్సరానికీ చెందిన గ్లోబల్‌ టెండర్‌ బకాయి లెక్కలను పరిశీలిస్తే, రూ.10 కోట్లకు పైగా బకాయిలున్న మిల్లర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేటకు చెందిన 1) వజ్ర వికాస్‌ రైస్‌ మిల్‌ బకాయి రూ.23 కోట్ల 13 లక్షలు, 2) జగన్మాత పార్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ – వల్లభాపురం రూ.20 కోట్ల 49 లక్షలు, 3) శ్రీ వసుంధర రైస్‌ మిల్‌ – బొజ్జగూడెం, కోదాడ రూ. 20 కోట్ల 46 లక్షలు, 4) శ్రీ వెంకటేశ్వర రైస్‌ ఇండస్ట్రీస్‌ – కాసారబాద్‌ రూ.19 కోట్ల 52 లక్షలు, 5) ఎ.ఎస్‌.ఆర్‌. పార్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ – తిరుమలగిరి రూ.15 కోట్ల 31 లక్షలు, 6) శ్రీ శివదుర్గ రైస్‌ ఇండస్ట్రీస్‌ – బిబిగూడెం, సూర్యాపేట రూ.11 కోట్ల 22 లక్షలు, 7) శ్రీ భువనేశ్వరి పార్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ – కొమరబండ, కోదాడ రూ.11 కోట్ల 19 లక్షలు, 8) రవి కృష్ణ రైస్‌ ఇండస్ట్రీస్‌ – సూర్యాపేట రూ.10 కోట్ల 61లక్షలు, కాగా రూ.10 కోట్లకు దగ్గరగా ఉన్న 9) వెంకట సాయి రైస్‌ ఇండస్ట్రీస్‌ – సూర్యాపేట బకాయి రూ.9 కోట్ల 78 లక్షలు, 10) శృతి రైస్‌ ఇండస్ట్రీస్‌ – హుజుర్‌ నగర్‌, రూ.6 కోట్ల 76 లక్షలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా రూ.1- 5 కోట్ల వరకు బకాయిలు ఉన్న రైస్‌ మిల్లుల జాబితా చూస్తే, అది చాంతాడును మించినంత పొడవుగా కన్పిస్తోంది.

బకాయిలున్న మిల్లర్లకే మళ్లీ సి.ఎమ్‌.ఆర్‌ కేటాయింపులు!

అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, గ్లోబల్‌ టెండర్‌ బకాయిలు చెల్లించని ఇదే మిల్లర్లకు ప్రస్తుత సీజన్‌ లోనూ మళ్లీ సి.ఎమ్‌.ఆర్‌ ధాన్యం కేటాయించడం. నిబంధనల ప్రకారం బకాయిలు ఉన్న మిల్లర్లను బ్లాక్‌లిస్ట్‌ చేయాల్సి ఉండగా, వారికి మళ్లీ ప్రభుత్వ ధాన్యం అప్పగించడం వెనుక ఎవరి ఆదేశాలున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి.

సివిల్‌ సప్లయ్‌ మంత్రి సొంత జిల్లాలోనే భారీ బకాయిలు..

ఈ మొత్తం వ్యవహారం సివిల్‌ సప్లయ్‌ మంత్రి సొంత జిల్లా సూర్యాపేటలోనే జరుగుతుండటం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి జిల్లా అయినప్పటికీ బకాయిల వసూలులో అధికారులు బకాయి మిల్లర్లపై ఇంత ఉదాసీనత ఎందుకు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.

పెరుమాళ్ళ నర్సింహారావు, ‘ఆదాబ్‌’ ప్రత్యేక ప్రతినిధి

- Advertisement -
RELATED ARTICLES

Latest News