HomeతెలంగాణKonda Murali | కొండా మురళి చెబితేనే రోడ్డు వేశాం

Konda Murali | కొండా మురళి చెబితేనే రోడ్డు వేశాం

  • ప్రభుత్వ భూమిలో రోడ్డు వేసిన ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ వెల్లడి
  • వరంగల్ జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎంఐహెచ్ కంపెనీ
  • ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ అశోక్‌పై భూఆక్రమణల ఆరోపణలు
  • ఆరోపణలు నిజమని నిర్థారించిన ఎమ్మార్వో.. పోలీసులకు ఫిర్యాదు..
  • తహశీల్దార్ ఫిర్యాదుపై విచారణ చేపట్టని అధికారులు, పోలీసులు
  • పెద్దల హస్తం ఉండటంతోనే చర్యలకు వెనకాడుతున్నారని టాక్?
  • కంపెనీ డైరెక్టర్ మంద అశోక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

అవినీతిపరులకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఏవిధంగా కొమ్ముకాస్తున్నారో తెలిపే మరో సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వరంగల్ జిల్లా(Warangal District)లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక అక్రమార్కుడు ఆక్రమిస్తే (Encroachment on Government Land) అధికారులు చూస్తూ కూర్చున్నారు. ఈ భూకబ్జాపై తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ మాత్రమే నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. సుమారు రూ.3 కోట్ల విలువైన దాదాపు 2000 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

నిందితుడు మంద అశోక్(Manda Ashok).. మంద ఐలయ్య కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ (ఎంఐహెచ్) లిమిటెడ్ కంపెనీ (Manda Ilayya Construction Private (MIH) Limited Company) డైరెక్టర్. ఇతను ప్రభుత్వ భూమిలో ఇల్లీగల్‌గా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా.. కొండా మురళి చెప్పిన తర్వాతే రోడ్డు వేశానని స్పష్టం చేయటం గమనార్హం. మంద అశోక్ చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే ఈ అక్రమ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల అండదండలు కూడా ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది.

- Advertisement -

ఎఫ్ఐఆర్ (FIR) నమోదై ఏడు నెలలు గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. తప్పుచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారో అర్థంకావట్లేదు. సామాన్యులు ప్రభుత్వ భూమిని ఒక్క గజం ఆక్రమించినా సవాలక్ష కేసులు, కోర్టు విచారణలు, వాయిదాలు.. అంటూ ముప్పుతిప్పలు పెట్టే అధికారులు, పోలీసులు.. పెద్దల విషయంలో ఎందుకంత సీరియస్‌గా యాక్షన్ తీసుకోవట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వెంచర్‌కి కట్టబెట్టినా.. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ వంటి బాధ్యతగల అధికారులు సైలెంట్‌గా ఉండటం వెనక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అమ్ముడుపోయారా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Warangal Government Land Encroachment by MIH Company 01 1

ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

వరంగల్ జిల్లా ఇంతెజర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కి మూడు కిలోమీటర్ల దూరం(ఈశాన్యం)లోని దేశాయ్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 61లోని రైతుల నుంచి 15-20 ఎకరాల భూమిని 60:40 నిష్పత్తిలో అభివృద్ధి వెంచర్ కోసం మంద అశోక్ తీసుకున్నాడు. అయితే.. ఆ భూమిలోకి వెళ్లటానికి రోడ్డు లేకపోవడంతో దాదాపు రూ.3 కోట్ల విలువ గల సుమారు 2,000 గజాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపట్టాడు. ‘‘ఇది ప్రభుత్వ భూమి’’ అనే బోర్డును కూడా తొలగించాడు. దీనికి సంబంధించి వరంగల్ తహశీల్దార్ మహ్మద్ ఇక్బాల్ 2025 మే నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో.. పోలీసులు ఎఫ్ఐఆర్ (నంబర్ 188/2025) నమోదు చేశారు. ఇందులో మంద అశోక్‌ను మొదటి నిందితుడిగా, జూలూరి నైనేష్ అనే వ్యక్తిని రెండో నిందితుడిగా పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వీరిద్దరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్‌ను నమోదుచేశారు. ఇదిలాఉండగా.. ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్‌పై భూఆక్రమణ, మైనింగ్ అనుమతుల దుర్వినియోగం వంటి పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను ప్రత్యేక కథనంగా ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తెస్తోంది.

Warangal Government Land Encroachment by MIH Company

కొండా మురళి చెప్పాకే ఎంఐహెచ్ ఆక్రమణలకు పాల్పడిందా?

వరంగల్ జిల్లాలో ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ భూఆక్రమణ, మైనింగ్ అనుమతుల దుర్వినియోగంపై స్థానికుల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. కంపెనీ డైరెక్టర్ మంద అశోక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా మురళి పేరు తెర మీదికి రావటంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చర్యల నుంచి తప్పించుకోవటానికి ఎంఐహెచ్ కంపెనీ కావాలనే కొండా మురళి పేరు వాడుకుంటోందా అని పలువురు అనుమానిస్తున్నారు.

ఎందుకు కూలగొట్టలేదు?

ఎఫ్ఐఆర్ నమోదై ఏడు నెలలు అయింది. అంతకుముందు ఐదు నెలల కిందటే అక్రమంగా ఆక్రమించుకున్న ఈ ప్రభుత్వ భూమిలో సిమెంట్ రోడ్ కూడా వేశారు. ఆ రహదారిని ప్రైవేట్ వెంచర్ కోసం వినియోగిస్తున్నారు. భూకబ్జాకోరు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ఏడాది గడుస్తున్నా అధికారులు ఎందుకు రంగంలోకి దిగట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ గానీ ఆర్డీవో గానీ చర్యలకు ఆదేశించకపోవటం వెనక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయా, లేక, అధికారులు అవినీతిపరులతో చేతులు కలిపారా అని జనం చర్చించుకుంటున్నారు. మందా అశోక్ మాదిరిగానే ఇంకెవరైనా ఇలాగే ప్రభుత్వ భూములను ఇష్టంవచ్చినట్లు ఆక్రమించుకోవచ్చా అని నిలదీస్తున్నారు. రోడ్డును కూలగొట్టకపోవటానికి గల కారణాలేంటో చెప్పాలని కోరుతున్నారు.

మరో కథనం ద్వారా ఎంఐహెచ్ అక్రమ మైనింగ్ వివరాలను వెల్లడించనున్న ‘ఆదాబ్ హైదరాబాద్’.

- Advertisement -
RELATED ARTICLES

Latest News