విదేశీ విద్యకు సహకారం.. పావలా వడ్డీకే విదేశీ విద్య రుణం..
త్వరలో స్డూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0లో చంద్రబాబు
భామిని ఏపీ మోడల్ స్కూలును పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించిన సీఎం
విద్యార్థుల ఉన్నత విద్య(higher education)కు, విదేశీ విద్య(Foreign Education)కు ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) చెప్పారు. దీనికోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని (Kalalaku Rekkalu Scheme) ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో అంత మేర పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని తెలిపారు. ఉన్నత, విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం, భామిని గ్రామంలో ఏపీ మోడల్ హైస్కూల్లో జరిగిన పీటీఎం 3.O కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్, టీచర్, విద్యార్థులతో సీఎం మాట్లాడారు. మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్ ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్ టూల్ ద్వారా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు. ఈ సందర్భంగా భామిని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
