- మరమ్మత్తుకు నోచుకోని అధునాతన బయో కెమిస్ట్రీ యంత్రం.
- లక్షలు వెచ్చించిన జనరేటర్ నిరుపయోగం.
- రెండేళ్లు పూర్తయిన సీఎం ఫోటో మార్చారా?.
- నిద్రావస్థలో వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ..
- బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల..
కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్న కొందరు వైద్యుల వల్ల టీ హబ్ నిర్లక్ష్యానికి గురి అవుతుందని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం వెనక వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్న తెలంగాణ డయాగ్నొస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్ ను జెఎసి నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాధనంతో లక్షలు వెచ్చించి హబ్ లో ఎంతో అధునాతన బయో కెమిస్ట్రీ యంత్రం చెడిపోతే నాలుగు నెలలు గడుస్తున్న మరమతులు చేయించడం లేదని, ఫలితంగా రోగులు ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే 17 లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన జనరేటర్ ప్రస్తుతం సిటీ స్కానింగ్, ఎక్సరేలు తీయాలంటే జనరేటర్ సామర్థ్యం సరిపోవడం లేదన్నారు. కరెంటు పోతే టీ హబ్ లో సేవలు నిలిచిపోయే దుస్థితి నెలకొందని, తక్షణమే ఈ హబ్ లోని బయో కెమిస్ట్రీ యంత్రాన్ని మరమ్మత్తులు చేసి, టీహబ్ కు అవసరమైన సామర్థ్యం కలిగిన జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నిద్రావస్థలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు టి హబ్ పై పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా…నేటికీ ఇంకా కెసిఆర్, హరీష్ రావులతో కూడిన ఫ్లెక్సీనే టీ హబ్ ముందు పెట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అంటే అధికారులకు లెక్క లేదా? లేక వివక్ష చూపుతున్నారా అని ఫైర్ అయ్యారు.టీ హబ్ వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వాన్ని ప్రజల్లో బదనాం చేయాలని టీ హబ్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కుమ్మక్కై చేస్తున్న కుట్రలా అనిపిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చిత్రపటాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టరును కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అద్యక్షులు అంజన్న యాదవ్, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, చెలిమిల్ల రామన్ గౌడ్, నాగరాజు, రమేష్ గౌడ్, నరేందర్ సాగర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
