దేశంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు(Governments) భారీ ప్రకటనలు(Statements) చేస్తున్నాయి. ప్రసార మాధ్యమాల్లో సందేశాలు(Messages) వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్(Plastic) వాడొద్దు.. సిగరెట్ (Cigarette) తాగొద్దు.. మద్యం(Liquor) సేవించి డ్రైవింగ్(Driving) చేయొద్దు.. గుట్కా(Gutka)లు తినొద్దు.. అంటూ ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే.. ఈ హానికర పదార్థాలు(Harmful substances) ప్రజలకు చేరేలా ఎవరు అనుమతులు ఇస్తున్నారు?. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలకు ఇదే ప్రభుత్వాలు నిస్సంకోచంగా లైసెన్సులు ఇవ్వడం పాలకుల ద్వంద్వ వైఖరి కదా! ఒక వైపు ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ మరో వైపు ఈ హానికర ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు లైసెన్స్‌లు, భారీ ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తున్నాయి.
ప్లాస్టిక్ పరిశ్రమలకు పన్నుల రాయితీలు, ఎగుమతి సదుపాయాలు ఇస్తారు. ఈ ద్వంద్వ వైఖరికి ప్రధాన కారణం ఆర్థిక ప్రయోజనం. పొగాకు, మద్యం వంటి ఉత్పత్తులపై ప్రభుత్వం భారీగా ఎక్సైజ్, కస్టమ్స్, జీఎస్టీ విధిస్తుంది. ఈ రూపంలో ఖజానాకు ఏటా వేల కోట్లు సమకూరుతున్నాయి. అందుకే హానికరమని తెలిసినా నిలిపివేయలేని పరిస్థితి. ఈ ఆదాయం ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కీలకం. ఒకవైపు తాగితే ఆరోగ్యం పాడవుతుందని చెబుతూ మరోవైపు తాగితే వచ్చే పన్నులతో అభివృద్ధి చేస్తామనే విధానాన్ని పాలకులు అనుసరించడం ఆర్థిక అవసరాన్ని తెలియజేస్తుంది.
నిషేధాలు, నియంత్రణలు అన్నీ మాటల్లోనే ఉంటాయి. కానీ.. కంపెనీల లాబీయింగ్, ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాల ముందు ఈ ప్రయత్నాలు ఫలించవు. ప్రకటనల్లో ఆరోగ్యంపై ఉన్న ప్రేమ, అనుమతుల్లో లాభాలపై ఉన్న ఆశ చావదు. ప్రజలను చెడు అలవాట్లు విడిచేయమంటారు గానీ తయారీదారులను మాత్రం కట్టడి చేయరు. అనుమతులు ఇవ్వడం, వాడకం పెంచడం, ఆపై వాడొద్దని ప్రకటనలు ఇవ్వడం. ఇది ప్రకటనల యుద్ధమా? ప్రభుత్వ స్థాయి మోసమా? ఈ విధానం ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కాదా!
ఒక వస్తువు ఆరోగ్యం, పర్యావరణానికి హానికరమని తెలిసినా.. వాటి నియంత్రణకు బదులు కేవలం వినియోగించవద్దని చెప్పడం విడ్డూరమే. అసలు వాటి తయారీనే నిలిపివేస్తే వినియోగించే సమస్యే ఉత్పన్నం కాదు. తయారీని పూర్తిగా నిషేధించే బదులు నియంత్రణపై దృష్టి పెట్టడం వల్ల అక్రమ రవాణా, నాణ్యతలేని ఉత్పత్తుల విక్రయానికి కూడా ఆస్కారం ఉంది. ప్రకటనలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఆ నిధులను ఆరోగ్య సదుపాయాల మెరుగుదల, వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటుకు కేటాయించడం సమంజసం.
పెద్ద కంపెనీలు ఆర్థిక శక్తితో ప్రభుత్వాలపై పెంచే ఒత్తిడి, రాజకీయ ప్రయోజనాలు, ఫండింగ్‌లు, ప్రకటనల నియంత్రణ ఇవన్నీ పాలసీలను ప్రభావితం చేస్తాయి. ప్రజా ప్రయోజనం కంటే కంపెనీ ప్రయోజనం ముందుకు రావడం వల్ల ప్రభుత్వాలు నిషేధాలపై వెనకాడుతున్నాయి. ఈ వైఖరితో ప్రజలు గుట్కా, మద్యం బారినపడుతున్నారు. యువత వ్యసనాలకు బలవుతూ రోగాలతో ఆరోగ్య వ్యయాలు పెరిగి కుటుంబాలు కూలిపోతున్నాయి. పర్యావరణం.. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమవుతుంది. ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల నిబద్ధతతో ఉంటే ఈ ద్వంద్వ వైఖరిని వీడి నికోటిన్, ఆల్కహాల్లపై కఠిన నియంత్రణ విధించాలి.
పర్యావరణహిత పరిశ్రమలకు మద్దతు ఇవ్వాలి. పొగాకు, గుట్కా వంటి ఉత్పత్తులను దశల వారీగా పూర్తిగా నిషేధించాలి. నిషేధం సాధ్యం కాని మద్యం విషయంలో ఉత్పత్తి, అమ్మకాలపై అత్యంత కఠినమైన లైసెన్సింగ్ విధానాన్ని అమలుచేయాలి. ప్లాస్టిక్ తయారీ కంపెనీలకు ప్రత్యామ్నాయ, పర్యావరణహిత ఉత్పత్తుల తయారీకి మారేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఆరోగ్యకరమైన జీవన విధానం, వ్యసనాల దుష్పరిణామాలు, పర్యావరణ పరిరక్షణ తప్పనిసరిగా చేర్చాలి. ప్రభుత్వం ప్రజారోగ్యంపై శ్రద్ధ పెట్టి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా తయారీదారులపై చర్యలతో చిత్తశుద్దిని నిరూపించుకోవాలి.
ప్రకటనలు ఒక మంచి అడుగే. కానీ.. ఆ ప్రచారాల ఫలితం ప్రజల ఆరోగ్యంలో కనిపించాలంటే అనుమతులు, లైసెన్సులు, పరిశ్రమ నియంత్రణలే మారాలి. ప్రజలను తప్పుబట్టడం సులువు. కానీ.. అసలు మారాల్సింది పాలనా విధానం. పాలకుల ద్వంద్వ వైఖరి. దేశం ఆరోగ్యవంతం కావాలంటే ప్రజలు మాత్రమే మారితే సరిపోదు. ప్రభుత్వాలు కూడా మారాలి. తన ఆర్థిక అవసరాలను ప్రజారోగ్యం కంటే ముఖ్యంగా చూడక ప్రజల ఆరోగ్యం, దేశ భవిష్యత్తు కోసమైనా పటిష్టమైన, నిబద్ధతతో కూడిన ఆరోగ్య విధానాన్ని అమలుచేయాలి.
- దుప్పటి మొగిలి
