సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)కి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ (Letter) రాశారు. తెలంగాణలో చెక్ డ్యాంలు(Check dams) కూలిపోవడంపై ఆయన అనుమానాలు (Doubts) వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. తనుగుల-గుంపుల (Thanugula Gumpula) వద్ద చెక్ డ్యాం కూలడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ (Brs) పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి నాణ్యతను గాలికొదిలేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని లేఖలో విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యాంలను నిర్మించిన కాంట్రాక్టర్లు (Contractors) కాంగ్రెస్ వాళ్లేనని పట్టిచూపారు. చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపులపై మీరు ఆదేశించిన విజిలెన్స్ విచారణ (Vigilance investigation) ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకొని దిద్దుబాటు చేసి ఉంటే తనుగుల-గుంపుల చెక్ డ్యాం కూలేది కాదని అభిప్రాయపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతను గాలికొదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తనుగుల వస్తున్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు, కూలిపోవడంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేసి ఆ సొమ్ముతోనే మళ్లీ చెక్ డ్యాంలను నిర్మించాలని సూచించారు.
బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖ యథాతథంగా..
శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిగారు,
తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు,
రాష్ట్ర సచివాలయం, హైదరాబాద్.
విషయం: తెలంగాణలో నాసిరకం చెక్ డ్యాంల నిర్మాణం, అనేక చోట్ల చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ…
నమస్కారం,
‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ అనే నినాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన విషయం మీకు తెలిసిందే. స్వరాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు దాటినా నేటికీ నీళ్లు-నిధులు-నియామకాల విషయంలో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ఏమైందో, ప్రజాధనం ఏ విధంగా దుర్వినియోగమైందో మీతోసహా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణం పేరుతోనూ భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు అనేక వార్తా కథనాలు, అరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో నిర్మించిన చెక్ డ్యాంల పరిస్థితి దారుణంగా తయారైంది. నాసిరకం పనులతో నిర్మించడంవల్ల ఇప్పటికే చాలా చోట్ల చెక్ డ్యాంలు కూలిపోయాయి.
తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని తనుగుల-గుంపుల వద్ద నిర్మించిన చెక్ డ్యాం ధ్వంసమైంది. 2021 లో వచ్చిన వరదల్లోనూ చాలావరకు కూలిపోయాయి. డిజైన్ లోపం, నాణ్యత సరిగ్గా లేని కారణంగా ప్రజాధనం నీటిపాలైంది. చెక్ డ్యాంల నిర్మాణ పనులపై ప్రజలు అనేక సందేహాలు లేవనెత్తుతూ అనేక ఫిర్యాదులు చేశారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని చెక్ డ్యాంల నిర్మాణం, నిధుల చెల్లింపుపై ఈ ఏడాది మే నెలలో మీరే స్వయంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై 57 చెక్ డ్యాంల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.287 కోట్లు చెల్లించిన దానిమీద మీరు విజిలెన్స్ విచారణ చేయిస్తున్నారు. దురద్రుష్టవశాత్తు ఆ విజిలెన్స్ విచారణ ఏమైందో నేటి వరకు అతీగతీ లేదు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే…. గత బీఆర్ఎస్ పాలనలో చెక్ డ్యాం కాంట్రాక్టులను ప్రస్తుత కాంగ్రెస్ నాయకులే చేజిక్కించుకున్నారు. చెక్ డ్యాంల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించలేదు. కమీషన్లకు కక్కుర్తి పడి బీఆర్ఎస్ పాలకులు చెక్ డ్యాంల నిర్మాణ పర్యవేక్షణను గాలికి వదిలేయడంవల్లే ఈ దుస్థితి ఏర్పడింది. తనుగుల-గుంపుల వద్ద చెక్ డ్యాం కూలిపోవడంతో ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు దానికి బాధ్యులు మీరంటే మీరంటూ చెక్ డ్యాం లకు వద్దకు వచ్చి డ్రామాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడకుండా నాణ్యతా ప్రమాణాలపై ద్రుష్టి పెట్టి ఉంటే చెక్ డ్యాంలు కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అక్రమ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ చెక్ డ్యాంల పరిరక్షణను గాలికొదిలేసింది. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఇసుక అక్రమ దందా చేస్తూ దోపిడీని దర్జాగా కొనసాగిస్తున్నారు. చెక్ డ్యాంల నాణ్యతపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రెండు పార్టీల నిర్లక్ష్యం, కమీషన్ల కక్కుర్తివల్ల రైతులు గోసపడుతున్నారు. నీటి పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాల వల్ల సమీప పంట పొలాల రైతులకు సారవంతమైన నేల నిసారంగా మారి నష్టం జరుగుతోంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని తనుగుల-గుంపుల చెక్ డ్యాం కూలివేతతోపాటు రాష్ట్రంలోని చెక్ డ్యాంల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలు, నాసిరకం పనులపై సమగ్ర విచారణ జరిపించాలి. చెక్ డ్యాంల కూలివేతకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యాతా ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యాంల కూలిపోవడానికి కారకులైన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నష్టపోయిన ప్రజధనాన్ని రాబట్టేందుకు సదరు కాంట్రాక్టర్ల ఆస్తులను జప్తు చేయాలి. తద్వారా తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదనే సంకేతాలను పంపినట్లవుతుంది. తక్షణమే ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతున్నాను.
భారత్ మాతాకీ జై…..
