ఆన్‌లైన్ లోన్ల పేరుతో రూ.3 కోట్ల వసూలు
భారీ మోసానికి పాల్పడ్డ ఏడుగురి అరెస్ట్
కూలి పనులకు కోల్‌కతా వెళ్లి సైబర్ నేరాల్లో శిక్షణ
ఏడాదిలో వెయ్యి మంది నుంచి కోట్లు కొల్లగొట్టిన వైనం
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా అమాయకులకు వల
బాధితుడి ఫిర్యాదుతో ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్లిన కొందరు యువకులు.. సైబర్ నేరాల్లో (Cyber Crimes) ఆరితేరి తిరిగొచ్చి భారీ మోసాలకు పాల్పడిన ఘటన మహబూబ్‌నగర్‌లో వెలుగు చూసింది. ఆన్‌లైన్ లోన్ల (Online Loans) పేరుతో ఏడాదిలో సుమారు వెయ్యి మందిని మోసం చేసి వారి నుంచి రూ.3 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఎస్పీ జానకి వెల్లడించారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం తువ్వగడ్డ తండాకు చెందిన ఏడుగురు యువకులు 2023లో ఉపాధి కోసం కోల్‌కతా(Kolkata) వెళ్లారు. అక్కడ సైబర్ క్రైమ్ ముఠాతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆన్‌లైన్ మోసాలపై శిక్షణ తీసుకొని కొంతకాలం కమీషన్ (Commission) పద్ధతిపై పనిచేశారు. వచ్చే డబ్బు సరిపోకపోవడంతో స్వయంగా పెద్ద మొత్తంలో సంపాదించాలనే దురాశతో 2024 చివరలో సొంత ఊళ్లకు వచ్చారు.
ఇక్కడికి వచ్చాక ‘ధన'(Dhana), ‘ఇండియా బుల్స్’ (India Bulls) పేరుతో నకిలీ ఆన్‌లైన్ లోన్ కాల్ సెంటర్లు (Call Centers) ప్రారంభించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆకర్షణీయ ప్రకటనలిచ్చి అమాయకులను ఆకట్టుకున్నారు. లోన్ కోసం సంప్రదించినవారి నుంచి ఆధార్, పాన్ కార్డు వివరాలు తీసుకొని వారికి నకిలీ లోన్ మంజూరు పత్రం పంపేవారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్, తొలి ఈఎంఐ అంటూ విడతలవారీగా డబ్బు వసూలు చేసి, ఆపై ఫోన్లను బ్లాక్ చేసేవారు.
మహబూబ్‌నగర్‌కు చెందిన హన్మంతు అనే వ్యక్తి నుంచి ఈ నెల 19న రూ.76,655 కాజేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం సిబ్బంది.. ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద లభించిన సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు చూసి పోలీసులు నివ్వెరపోయారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదు, ఆటో, బైక్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించి, కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారణ జరుపుతామని ఎస్పీ తెలిపారు.
