- ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నా నిధులు పక్కదారి పట్టడం ఏంటి..?
- స్వచ్ఛ సర్వేక్షన్ నిధుల గోల్ మాల్ పై విజిలెన్స్ విచారణ జరిపించాలి
- మాజీ డిప్యూటీ మేయర్, గుగ్గిల్లపు రమేశ్ డిమాండ్
కరీంనగర్:- నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలనలోనూ అవినీతి పెచ్చరిల్లిపోతుందని మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్ ఆరోపించారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో రమేష్ ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం ద్వారా విడుదల చేసిన 30 లక్షల నిధులు, బల్దియాకు ప్రత్యేక అధికారినిగా ఉన్నా కలెక్టర్ హయాంలో గోల్మాల్ కావడం ఏమిటని ప్రశ్నించారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటి నుండి, ఇప్పటివరకు వచ్చిన నిధులపై వాటిని ఖర్చు చేసిన అంశాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ వాల్పెయింటింగ్లు వేయకుండా, హోర్డింగ్స్ ఏర్పాటు చేయకుండా, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా, కొంతమంది బల్దియా అధికారులు, ఉన్నతాధికారులను చేతుల్లో పెట్టుకొని రూ.30 లక్షల అవినీతి బాగోతానికి తెరలేపారని విమర్శించారు.
నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పై ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించక పోయినా, ఈ సంవత్సరం నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ విజయవం తానికి వాల్పెయింటింగ్స్, హోర్డింగ్స్ ద్వారా ప్రచారం కల్పించినట్లుగా పెద్ద ఎత్తున బిల్లు తీసుకోవడం చూసుకుంటే అవినీతి ఏ మేరకు కార్పొరేషన్ లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది ఒక కార్యక్రమాన్ని మినహాయిస్తే ఎన్ని కార్యక్రమాలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. వాల్పెయింటింగ్, హోర్డింగ్స్ ద్వారా ప్రచారంతో పాటు, కార్యక్రమాల నిర్వహణ పేరిట నగరపాలకసంస్థలో రూ.30 లక్ష లు బిల్లు చేయడం అధికారుల అవినీతికి పరాకాష్టగా మారిందన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ స్పందించి స్వచ్ఛ సర్వేక్షన్ నిధుల గోల్ మాల్ పై విచారణ అధికారిని నియమించి లోతుగా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి కి పాల్పడిన అధికారిని గుర్తించి సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
