సీఐఐ సదస్సు సందర్భంగా విశాఖ(Vishaka Summit)లో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్ టేబుల్ సమావేశం(India-Europe Business Partnership Roundtable Meeting)లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాల్గొని ప్రసంగించారు. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరమని, మంచి వనరులు ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పారు. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఏఐ డేటా సెంటర్(Google Largest AI Data Center)ను విశాఖలోనే ఏర్పాటుచేస్తోందని తెలిపారు. సబ్ సీ కేబుల్ (Sub Sea Cable) కూడా ఈ ప్రాంతం నుంచే ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. గతంలో ఐటీని ఆంధ్రప్రదేశ్‌లో ప్రోత్సహించామని, గూగుల్, ఆడోబ్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థల సీఈఓలు భారతీయులే ఉన్నారని వెల్లడించారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక సంస్కరణల (Economic Reforms) తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి. జీవన ప్రమాణాలు (Standards of living) గణనీయంగా పెరిగాయి. వాటికి అనుగుణంగా సంపద పెరగాల్సి ఉంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాం. భారత్ క్వాంటం మిషన్ (Bharat Quantum Mission) ప్రారంభించింది. దాన్ని అందిపుచ్చుకొని తొలి క్వాంటం వ్యాలీని ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటుచేస్తున్నాం. అలాగే డ్రోన్లు కూడా పెద్దఎత్తున వినియోగంలోకి తెస్తున్నాం. సివిల్ అప్లికేషన్లు, డిఫెన్సు రంగాల్లో వీటి తయారీ పెరగాలి. అందుకే ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటుచేసి ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం. స్పేస్ అప్లికేషన్లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి.
ఏపీలో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాధాన్యం కూడా గణనీయంగా పెరిగింది. సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో మేం బలంగా ఉన్నాం. అలాగే పోర్టు రవాణా రంగంలో ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నాం. రైల్వే నెట్‌వర్క్ కూడా పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశంలోని వివిధ నగరాల్ని అనుసంధానం చేస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 160 గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలుచేసి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇస్తున్నాం.
కేవలం 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. గూగుల్ కూడా రెండు మూడు రోజుల్లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించబోతోంది. వారికి కూడా చాలా కొద్ది రోజుల్లోనే అనుమతులిచ్చాం. ప్రోత్సాహకాలు, వేగంగా అనుమతులు ఇవ్వటంలో ఏపీకి పోటీ లేదు. పెట్టుబడులతో ముందుకు వస్తే చాలు ఎస్కార్ట్ ఆఫీసర్‌ను నియమించి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా సహకరిస్తాం. ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుంది.
ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు, విద్య, వైద్యం, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి సాటి లేదు. వీటిని ఉపయోగించుకోవాలని యూరోప్ దేశాల్లోని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థాయి దేశంగా మారుతుంది. అందులో ఏపీ ముందుంటుంది.
