- ఏడుపాయల్లో ఇదీ పరిస్థితి..
- భక్తుల సౌకర్యాల పేరుతో వసూళ్ల హడావుడి!
- సౌకర్యాలు పక్కన పెట్టి.. ఆదాయ మార్గాలు ఎక్కుపెట్టి
- టెండర్లు సేవలకా..? వసూళ్లకా..??
- పారదర్శకత మాటున నిర్లక్ష్యపు వ్యవహారం?
- ఆదాయ లెక్కల నడుమ భక్తుల ఆవేదన
- ముందు సేవ.. తరువాతే ఆదాయమంటున్న భక్తులు
సంవత్సరానికి లక్షలాది మంది భక్తులు దర్శనార్థం వచ్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సానిపల్లి గ్రామంలో వెలిసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రం భక్తి, శ్రద్ధలతో వచ్చే ప్రజలతో ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ.. ఆ భక్తుల సౌకర్యాల పరంగా పరిస్థితి మాత్రం విచారకరం. ఇటీవల దేవస్థానం అధికారులు విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్ మరోసారి భక్తుల కోపానికి కారణమైంది. “భక్తుల సౌకర్యాల కోసం” అని చెబుతూ వసూళ్ల దిశగా పయనమవుతున్న అధికారుల ధోరణిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారులు ప్రతీ ఏడాది సౌకర్యాల మెరుగుదల పేరిట ప్రణాళికలు ప్రకటిస్తున్నా, అమలుచేయడంలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. తాగునీటి సదుపాయం లేకపోవడం, శానిటేషన్‌లో నిర్లక్ష్యం, వసతి గృహాల నిర్వహణ లోపం, పార్కింగ్ సమస్యలు మొదలైనవి ప్రతిరోజు భక్తులను వేధిస్తున్న అంశాలు. ఇవి ప్రతి ఏటా పునరావృతమవుతూనే ఉన్నాయి.
టెండర్లు సేవలకా? వసూళ్లకా?
ఏడుపాయల దేవస్థానం అధికారులు ఇటీవల విడుదల చేసిన టెండర్ నోటిఫికేషన్ ప్రకారం కొబ్బరికాయలు,పూజా సామాగ్రి విక్రయించుకునే హక్కు, ఒడిబియ్యం, తలనీలాలు ప్రోగు, వినోదానికి సంబంధించి ఎక్సిబిషన్ ఏర్పాటు, పాదరక్షలు పెట్టుకోవడం వంటి విభాగాలకు వేర్వేరు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో టెండరు షెడ్యూలు ధర రూ.2,000 మరియు ధరావత్తు చెల్లింపులు రూ. 25,000 నుంచి రూ.8 లక్షల వరకు నిర్ణయించడం భక్తుల్లో అసంతృప్తిని కలిగించింది.ఇంత భారీ వసూళ్లు చేస్తూ కూడా సదుపాయాలు ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.
పారదర్శకత మాటున నిర్లక్ష్యపు వ్యవహారం?
దేవస్థానం అధికారులు టెండర్లు పారదర్శకంగా ఉంటాయని చెబుతున్నా వసూళ్లు మాత్రమే స్పష్టంగా కనిపిస్తున్నాయని, సౌకర్యాలు, సేవ మాత్రం కనపడడం లేదని భక్తులు మడిపడుతున్నారు. భక్తులు ఒడిబియ్యం సమర్పణ అర్చకుల ద్వారా చేయాల్సింది. కానీ గుత్తేదారులు ఒడిబియ్యం సమర్పణ వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు ఇటీవల పలు పత్రికలలో వెలువడిన వార్తా కథనాలే నిదర్శనం.
ఆదాయ లెక్కల నడుమ భక్తుల ఆవేదన
ఏడుపాయల జాతరకు వస్తున్న భక్తులు వనదుర్గామాత దర్శనానికంటే ఎక్కువగా ఇతర ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. తాగునీరు లేక చల్లని నీడ లేక, పార్కింగ్ కోసం తిప్పలు, మరుగుదొడ్ల లేమితో అవస్థలు పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం వసూళ్ల లెక్కల్లోనే మునిగిపోయారు. భక్తుల సౌకర్యాలే పరమావధిగా భావించే అధికారులు దాన్ని వ్యాపారంలా చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ముందు సేవ.. తరువాతే ఆదాయం..
ముందు సదుపాయాలు కల్పించండి, తర్వాత టెండర్లు వేయండి అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం అభివృద్ధికి ప్రజల సహకారం ఉంది కానీ దానిని ఆదాయం మూలంగా మార్చడం ఆధ్యాత్మికతకు విరుద్ధమని పలువురు భక్తులు వాపోతున్నారు. భక్తుల సౌకర్యాలు భక్తిభావంలో భాగమా? లేక అధికారుల ఆదాయ లెక్కలలో భాగమా?? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా అధికారులు భక్తుల సౌకర్యాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
