- రోడ్డే మా జాగీర్” అంటూ దౌర్జన్యం..!
- విద్యార్థుల ప్రాణాలతో ఆటలు..!
- సిద్దిపేట–మెదక్ ప్రధాన రహదారిపై పరాకాష్టకు చేరిన నిర్లక్ష్యం..!
- ఫోటో తీసినందుకు బెదిరింపులు
- ఫోన్ లాక్కొని వీడియోలు డిలీట్ చేసిన ప్రిన్సిపాల్..!
- ప్రమాదకర పార్కింగ్‌పై పోలీస్, రవాణా శాఖల మౌనం..!
- సామాన్యులకు చట్టం, స్కూల్ యాజమాన్యానికి మినహాయింపా..?
సిద్దిపేట పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల దౌర్జన్యం, నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. సిద్దిపేట–మెదక్ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మాస్టర్ మైండ్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రతను, ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా గాలి వదిలేసింది ప్రజా రహదారినే తమ జాగీర్‌లా మలచుకుంది. బస్సులను రోడ్డుమీద నిలిపి విద్యార్థులను ఎక్కించడం, దింపడం, అడ్డంకులు సృష్టించడం ఈ దృశ్యాలు చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

రోడ్డుపైనే బస్సులు – భద్రత గాలికొదిలిన యాజమాన్యం..!
సిద్దిపేట-మెదక్ ప్రధాన రహదారి రోజంతా వాహనాలతో కిటకిటలాడుతుంటుంది. అలాంటి రహదారిపైనే మాస్టర్ మైండ్స్ పాఠశాల బస్సులను ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా నిలిపి విద్యార్థులను దింపడం, ఎక్కించడం చేస్తున్నారు. ఒక చిన్న వాహనం వేగంగా వస్తేనే ప్రాణాంతక ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి.
ఫోటో తీస్తే ఫోన్ లాక్కొని బెదిరింపులు..!
ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన ఓ యువకుడు సాక్ష్యాల కోసం ఫోటోలు, వీడియోలు తీస్తుండగా — అక్కడికి పాఠశాల ప్రిన్సిపాల్ విచ్చేశారు. బాధ్యతాయుతంగా స్పందించాల్సింది పోయి ఆ యువకుడిపై విరుచుకుపడి, ఫోన్ బలవంతంగా లాక్కొని అందులోని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారు.
ఇంతటితో ఆగకుండా “మా స్కూల్ ఫోటోలు తీస్తావా..? రోడ్డు మా జాగీర్! నీ సంగతి చూస్తాం!” అంటూ బహిరంగంగా బెదిరించారు.
ఒక విద్యాసంస్థ ప్రిన్సిపల్ ప్రజల భద్రత విషయాన్ని ప్రశ్నించినందుకు ఇలా దౌర్జన్యానికి దిగడం నేరమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
చట్టం సామాన్యులకేనా..? అధికారుల మౌనం ప్రశ్నార్థకం..!
సామాన్యులు రోడ్డు పక్కన బైక్ నిలిపినా పోలీసులు, ట్రాఫిక్ అధికారులు వెంటనే ఫైన్‌లు వేస్తారు. కానీ, ప్రధాన రహదారిపైన బస్సులను నిలిపి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న మాస్టర్ మైండ్స్ యాజమాన్యంపై మాత్రం పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
ఇది విద్యా సంస్థల అహంకారం కాదా? లేక అధికారుల అండదండలతోనే ఈ బరితెగింపు జరుగుతోందా? అన్న ప్రశ్నలు సిద్దిపేట ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.
తక్షణ చర్యల కోసం ప్రజల డిమాండ్
ప్రజల భద్రతను పక్కనబెట్టి, ప్రజలనే బెదిరించే మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రమాదకరంగా ఉన్న ఈ పరిస్థితిపై విద్యాశాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే ఏ ప్రమాదానికైనా అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద విద్యా సంస్థ పేరుతో ప్రజల భద్రతను తాకట్టు పెట్టే, రహదారులను సొంత ఆస్తిలా వాడుకునే ఈ “మాస్టర్ మైండ్స్” పాఠశాల నిర్వాకం, ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం రెండు కలిసినపుడు, సిద్దిపేటలో ప్రమాదాలు తప్పవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
