కమిషనర్ ఆర్.వి కర్ణన్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లు, ఎస్.ఎన్.డి.పి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆర్.వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో కమిషనర్ ఆర్ వి కర్ణన్ నగరంలోని అన్ని జోన్లలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, ఎస్.ఎన్.డి.పి పనుల పై జోనల్ కమిషనర్ లు , ప్రాజెక్ట్స్ ఇంజనీర్ లు, ప్లానింగ్ , భూ సేకరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబంధకాలు, సవాళ్లు, పెండింగ్ పనులు, అందుకు గల కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వేగంగా పూర్తికి కమిషనర్ ఆర్ వి కర్ణన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రాజెక్ట్ ల పూర్తికి నిధుల కొరత లేదన్నారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూసేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. హెచ్ సిటీ కింద చేపడుతున్న పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను కమీషనర్ ఆదేశించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి , బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, హేమంత్ కేశవ్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ జోతిర్మయి (ఎస్.ఎన్.డి.పి, లేక్స్), చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, ప్రత్యేక ఉప కలెక్టర్ రాములు నాయక్, ఎస్.ఈ, ఈఈ లు తదితరులు పాల్గొన్నారు.