ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు
విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి (Vice President) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం మోదీ (PM Modi) నేతృత్వంలో ఆర్థికంగా సుసంపన్నమైన దేశంగా భారత్ (Bharat) ఎదుగుతోందన్నారు.
సంపద సృష్టిస్తేనే ప్రపంచంలో పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుందని, ఆ దిశగా కృషి జరుగుతోందని పేర్కొన్నారు. ఏపీలో సుపరిపాలన, అత్యుత్తమ విధానాలనే సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ఆచరిస్తోందని చెప్పారు. అభివృద్ధికి, సంక్షేమానికి చంద్రబాబు రోల్ మోడల్ అని అన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దారని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు.
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయెల్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే కాదు.. యావత్ భారతదేశం అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ఆలోచిస్తారన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దార్శనికత, ఆవిష్కరణ, ఉత్సాహం, ఆశయం, వృద్ధి.. ఇవే విశాఖపట్నానికి నిర్వచనం అన్నారు.
భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జి, సిఐఐ అధ్యక్షులు రాజీవ్ మెమాని, జిఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు, బజాజ్ ఫైనాన్స్ సిఎండి సంజీవ్ బజాజ్, అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శోభన కామినేని, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ జెఎండి అమిత్ కళ్యాణి, టివిఎస్ మోటార్స్ సిఎండి సుదర్శన్ వేణు, సిఎస్ విజయానంద్, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
