- ఓయూ ప్రాంగణంలో యువ న్యాయవాదుల నిరసన
- తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలి
- హైకోర్టు న్యాయవాది ఇడుగు రజినీకాంత్ డిమాండ్
రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ యువ న్యాయవాదులు ఆందోళనకు దిగారు.ఓ.యు పరిధిలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో హైకోర్టు న్యాయవాది ఇడుగు రజినీకాంత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని,నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.న్యాయవాదుల భద్రతకు చట్ట పరిరక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా న్యాయవాది ఇడుగు రజినీకాంత్ మాట్లాడుతూ,రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవాదులు న్యాయ వ్యవస్థకు ప్రధాన స్తంభాలుగా నిలుస్తున్నప్పటికీ,వారికి తగిన రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేకంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.న్యాయవాదులపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో సరైన రక్షణ చట్టాలు లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు.కొంతమంది న్యాయవాదులు విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని,ఇది న్యాయవ్యవస్థకు చేటు కలిగించే పరిణామమని చెప్పారు.ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను ఉదాహరణగా చూపుతూ,ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అడ్వకేట్ రక్షణ చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని సూచించారు.
అదేవిధంగా యువ న్యాయవాదుల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని వారికి నెలకు రూ.5,000 స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.యువ న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది వారికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో నామ సైదులు,కొమ్మనబోయిన సైదులు,చేరాల వంశీ,వంశీ,భూతం రఘు,భగత్ సింగ్,కథలపూర్ రమేష్,ఎన్నపోతుల అరుణ్ కుమార్,నరేందర్,మహేష్,అశ్వన్ తదితర న్యాయ విద్యార్థులు మరియు యువ న్యాయవాదులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయవాదుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు.
