Friday, February 13, 2026
HomeరాజకీయంBC | బీసీ ఉద్యమానికి వర్గ శత్రువు ఎవరు?

BC | బీసీ ఉద్యమానికి వర్గ శత్రువు ఎవరు?

ఏ నినాదం వెనక ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత వరకు ప్రజలు మోసపోతునే ఉంటారని కామ్రేడ్ లెనిన్ (Comrade Lenin) అన్నారు. నేడు జరుగుతున్న బీసీ ఉద్యమానికి (BC Movement) విధానపరమైన వర్గ శత్రువు (Enemy) ఎవరో గుర్తించనంత కాలం ఉద్యమ నేపథ్యం.. అనుకున్న లక్ష్యం (Target) చేరదు. గొంగడిలో కూర్చొని అన్నం తిన్న చందంగా ఉద్యమం పల్చన కావొద్దు. బీసీల న్యాయమైన హక్కుల (Rights) సాధన స్వతంత్ర భావజాల పునాదులపైన నిర్మాణం జరగాలి. రాజకీయ పార్టీల (Political Parties) కనుసన్నల్లో ఉద్యమం ఉంటే గొర్రెల మందలో తొడేళ్లు దూరినట్టే ఉంటుంది. బీసీ ఉద్యమంలో ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది.

బీసీ సమాజ ప్రయోజనాల కన్నా వ్యక్తి పూజ చుట్టే ఉద్యమం తిరగడం, ఉద్యమ లక్ష్యం నిర్ణయాలు సొంతంగా తీసుకోవడం రాజకీయ పార్టీల నియంత్రణ వల్ల ఉద్యమ కార్యాచరణ వెనక్కి తగ్గడం జరుగుతున్న సందర్భాలు అనేకం చూశాం. గ్రౌండ్ నిర్మాణంలో భావజాల వ్యాప్తి ఎంతో కొంత ఉన్న ఉద్యమ నిర్మాణం అవసరం ఉంది. ఆచరణ లేని సిద్దాంతం గుడ్డింది అన్నట్టు ఉద్యమానికి ఆయువుపట్టు నిర్మాణం. దీనిపైన అన్ని బీసీ కుల సంఘాలు దృష్టి పెట్టాలి. బీసీల సాంస్కృతిక పోరాటం అత్యవసరం. బీసీ ఉద్యమానికి బలమైన సాంస్కృతిక సాహిత్య పునాది పటిష్టమైన విభాగం ఉండాలి.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, దళిత ఉద్యమంలో విపరీతమైన సాహిత్యం వచ్చింది. కళా రూపాలు వచ్చాయి. వేలాది మంది కళాకారులు తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జే కట్టి ఊరూవాడా తిరిగి ఉద్యమ వ్యాప్తికి కృషి చేశారు. బీసీ ఉద్యమం ఆవిధంగా సాంస్కృతిక, సాహిత్యపరంగా బలపడాలి. పుస్తకాలు, పాటలు, సినిమాలు, కళా రూపాలు, వృత్తుల సంస్కృతి విరివిగా బయటికి రావాలి. ఉదాహరణకు 42% రిజర్వేషన్ల ఉద్యమానికి కేవలం ఒక్క రాజకీయ పార్టీలే శత్రువులు కావు. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలు అడ్డుకట్టగా ఉన్నాయి. దీనిపైన సమంతరమైన పోరాటం జరగాలి.

బీసీల బలమైన ఉద్యమానికి బీసీలే నాయకత్వం వహించాలి. కడుపు నొప్పి ఉన్నావాడే మాత్రలు వేసుకోవాలి. అప్పుడే నొప్పి తగ్గుతుంది. ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులు మద్దతు ఇస్తే వారిది కేవలం మంత్రాసాని తనమే అయి ఉండాలి. బీసీ ఉద్యమం పైన కర్ర పెత్తనం ఉండకూడదు. బీసీ ఉద్యమానికి బీసీలు ఇన్‌సైడర్లు. బీసీయేతరులు ఎవరైనా ఔట్‌సైడర్లే. ఈ సోయితో బీసీ ఉద్యమం ముందుకు సాగాలి. అమ్మకానికి ఉద్యమం అన్న నాయకత్వం పట్ల అప్రమత్తత అవసరం. రాజకీయ పార్టీల మద్దతు అవతలి నుంచే తీసుకోవాలి. గడప అవతలే చుట్టం అన్న విధంగా ఉండాలి. బీసీ ఉద్యమానికి రాజకీయ స్థబ్దత ఉంది.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వేలాది వేదికలు ఉన్న టీఆర్ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా పంట కోతకొచ్చిన తర్వాత రాజకీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కుప్పగా మలుచుకుంది. రేపటి రోజున బీసీ ఉద్యమం బలబడి ఓ ఉద్యమ శక్తిగా మారితే రాజకీయ పార్టీ లేకపోతే ఏదో ఒక రాజకీయ పార్టీకి బీసీ ఉద్యమం కొమ్ము కాసే పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీ నిర్మాణంపై దృష్టి అవసరం. ఉద్యమ నిర్మాణంతోపాటు ఉద్యమ భావజాల ఐక్యత అవసరం. బీసీ సంఘాల మధ్య, కుల సంఘాల మధ్య ఓ గొలుసు కట్టు మానవీయ పునర్ నిర్మాణ బంధం బలపడాలి.

బీసీల్లో వెనకబడిన ఎంబీసీలు, బీసీ సంచార కులాల పట్ల ఎదిగి ఉన్న బీసీ కులాల వారు వారి రాజకీయ ప్రాతినిధ్యం, ప్రయోజనాల కోసం చేయుత ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీసీల ఏబీసీడీ వర్గీకరణ ద్వారా ఎవరి వాటా వారికి దక్కేలా సహపంక్తి భోజనంలా సమాంతర న్యాయం అందరికీ జరగాలి. బీసీ ఉద్యమం రాజకీయ నినాదమే కాకుండా ఆర్థిక నినాదం, సామాజిక నినాదం ఎత్తుకోవాలి. సంపదలో, సామాజిక న్యాయంలో, విద్య, ఉద్యోగంలో మనమెంతో మనకంత వాటా దక్కాలి. అదే బీసీల న్యాయమైన అస్తిత్వం.

  • అంబాల నారాయణ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్
- Advertisement -
RELATED ARTICLES

Latest News