ప్రశాంతంగా ముగిసిన బీసీ బంద్
శనివారం బీసీ బంద్‌కు సబ్బండ వర్గాల నుంచి అందిన మద్దతు
పోలిటికల్ పార్టీల్లో మరింత హీట్ పెంచిన బీసీ బంద్
రిజర్వేషన్ల ఆమోద బాధ్యత ఒకరిదంటే ఒకరిదని పొలిటికల్ పంచ్లు
ఎన్నికల నిర్ణయంపై తక్షణ నిర్ణయమేంటన్న హైకోర్టు
రిజర్వేషన్లు ఆమోదించాల్సిందేంటూ.. ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న బీసీ సంఘాలు
ఈనెల 23న జరిగే రాష్ట్ర కేబినేట్ మీటింగ్‌లో విషయం కొలిక్కివచ్చేనా..
స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్లతోనా…42 శాతం ఆమోదం తర్వాతేనా..
ఏడాదిన్నర గడిచిన పూర్వ వైభవం నోచుకోని గ్రామ పంచాయతీలు
ఎన్నికలు పెడితేనే గ్రామాలకు ఊపిరి.. లేదంటే జీవచ్చవము అంటున్న విశ్లేషకులు
జీవో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ (BC) సంఘాల పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన తెలంగాణ బంద్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలన్న డిమాండ్తో పిలుపునిచ్చిన ఈ బంద్ (Bandh) తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజకీయ దిశ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశించిన నేపథ్యంలో, ఈ పరిణామాలు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని.. దీంతో ఈనెల 23న జరిగే క్యాబినెట్ మీటింగ్(Cabinet Meeting)పై ప్రభావం చూపనుందనీ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవైపు సుప్రీంకోర్టులో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తీర్పు ప్రభుత్వంకు భంగపాటు కలిగిన.. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సూచనలు చేసింది. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి ఎటువంటి చట్టబద్ధ కారణం లేదని స్పష్టం చేస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రభుత్వం ఇక తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశం పరిష్కారం కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే, ఆ సామాజిక వర్గ ప్రజల నుంచి పెద్ద రాజకీయ ప్రమాదమని అధికార కాంగ్రెస్ భావిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తమ ప్రధాన ఎన్నికల హామీగా చూపిస్తోంది. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఏ ఎన్నికలకైనా వెళ్ళబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం బంద్ తర్వాత బీసీ నేతలతో కీలక సమావేశాలు జరపబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం తాత్కాలిక ఆర్డినెన్స్ రూపంలో బీసీ రిజర్వేషన్లను అమలు చేసే దిశగా అడుగులు వేస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్-జనవరి మధ్య జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు..
కామారెడ్డి (Kamareddy) బీసీ డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్నది కాంగ్రెస్ ఎన్నికల హామీ. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టే సమయం వచ్చింది. ప్రభుత్వం నిజంగా బీసీల పక్షాన ఉందా లేదా అనే దాన్ని ఈ నిర్ణయం చెబుతుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అంటున్నారు. ఇక బంద్ రోజున బీసీలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్ణయం తీసుకోకుండా గందరగోళం సృష్టిస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆలస్యం చేస్తోంది అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇకపోతే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్పై ఒత్తిడి పెంచుతూ, బీసీ ఉద్యమాన్ని తమ రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా ఈ 42 శాతం బీసీ రిజర్వేషన్ ఉండనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
బీజేపీనీ టార్గెట్ చేసిన కాంగ్రెస్, తెలంగాణ జాగృతి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇప్పించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చొరవ తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్దిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆపి మరీ, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్లో ఈ 42శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దంగా రక్షణ ఉండేలా తొమ్మిదో షెడ్యూలో చేరే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజీపీ నాయకత్వం ఒత్తిడి తేవాలని పీసీసీ కోరారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది.. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.
బంద్ విజయవంతమైన తర్వాత బీసీ సంఘాలు మరింత కఠిన వైఖరి ఎత్తుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ బీసీ సంఘాల నాయకలు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించకపోతే భారీ స్థాయిలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల కదలికలు కాంగ్రెన్కు ఒత్తిడిగా మారే అవకాశముంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్‌లు బీసీ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ త్వరిత నిర్ణయం తీసుకుంటే అది తిరిగి బీసీ ఓటు బ్యాంకును బలపరచగలదన్నారు.
ఏదేమైనప్పటికీ గ్రామ పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నర కావడంతో గ్రామాల్లో అన్ని పనులు అటకెక్కాయి. కేంద్రం నుంచి నిధులు రాక పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దాంతో రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా ఆగ్రహం మూటగట్టుకుంది. త్వరితగతిన ఎన్నికల నిర్వహించి పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన ప్రభుత్వం.. బీసీ రిజర్వేషన్ల అంశంతో ఇది జరిగేనా అనే అనుమానం బలపడుతుంది. హైకోర్టు స్టేతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజ కీయ నాయకులు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతతో పిలుపునిచ్చిన బంద్ను రాష్ట్ర ప్రజలు సైతం విజయవంతం చేశారు..మరీ ఎన్నికలపై ఇక తేల్చాల్సింది కాంగ్రెస్ సర్కారే.. దీంతో ఈనెల 23న జరిగే కేబినేట్ సమావేశంపైనే రాష్ట్ర ప్రజానీకం ఆశలు పెట్టుకున్నారు.. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుందో.. వేచి చూడాలి..
