- 15-20 స్థానాలు గెలిచే అవకాశం ఉన్న కొందరి తీరు వల్ల ఓటమి.
- అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం.
- వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాల తో కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం జరిగిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నంది హిల్స్ లోని తన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తో పోలిస్తే గ్రామపంచాయతీ ఎన్నికల్లో 35.09 శాతం కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించిందని పేర్కొన్నారు.
80 స్థానాలతో పాటు మరో 15 – 20 సర్పంచ్ స్థానాలు గెలిచే అవకాశం ఉన్న సీనియర్ నాయకులమని చెప్పుకుంటున్న కొందరీ వెన్నుపోటు రాజకీయంతో ఓటమిపాలయ్యామని అసహనం వ్యక్తం చేశారు. తనపై కోపం ఉంటే ఎదురుగా నాతో చూసుకోవాలి కానీ కార్యకర్తలపై వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ రాక్షససానందం పొందడం ఏంటని ప్రశ్నించారు. సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాలపై అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో 140 గ్రామపంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 51 శాతం బీసీలకు కేటాయించి బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో జరిగిన గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు రుజువు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆదరించిన ప్రజలందరికీ, కష్టపడి పనిచేసిన ప్రతి నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి, పిసిసి సభ్యులు శంకర్ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
