ఆయన పేరిట అవార్డు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
హైదరాబాద్‌లో అందెశ్రీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని సూచన
తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ(Andesri)కి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ (Former Chairman of Telangana BC Commission) డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు (Vakulabharanam Krishnamohan Rao) నివాళులు అర్పించారు. ఆయన భౌతికంగా మనల్ని విడిచిపోవడం తెలంగాణ మట్టికి, భాషా సాహిత్యానికి తీరని లోటని అన్నారు. ప్రజల హృదయాల్లో స్ఫూర్తి వెలిగించిన ఉద్యమ చైతన్యానికి అందెశ్రీ లేని లోటు తీర్చలేదని పేర్కొన్నారు. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచిన అందెశ్రీ భౌతికకాయానికి వకుళాభరణం నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం ఉద్యమ ఆత్మగళంగా నిలిచిందని కొనియాడారు. ఆ గేయం పాడిన, విన్న ప్రతిసారీ ప్రతి గుండెలో తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిధ్వనించేదని పేర్కొన్నారు.
‘మాయమవుతున్నడమ్మ మనిషన్నవాడు’ గీతంలో మానవ విలువలు క్రమంగా కరిగిపోతున్న కాలమానాన్ని అందెశ్రీ అత్యంత సరళమైన మాటల్లో, లోతైన భావంతో వ్యక్తీకరించారని వకుళాభరణం అన్నారు. ‘అందెశ్రీ కేవలం కవి మాత్రమే కాదు. ఆయన పదాల్లో మట్టివాసన ఉంది. ఆయన భావాల్లో ప్రజల ఊపిరి ఉంది. ఆయన స్వరంలో తెలంగాణ గుండెచప్పుడు ఉంది. స్వరం నిశ్శబ్దమైనా తెలంగాణలో శాశ్వత ప్రతిధ్వని’ అని వకుళాభరణం తెలిపారు. అందెశ్రీ సాహిత్య సేవలను శాశ్వతంగా స్మరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరుతో రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారాన్ని(Literary Award), హైదరాబాద్‌లో విగ్రహాన్ని (Statue) ఏర్పాటుచేయాలని కోరారు. అందెశ్రీ జయంతి, వర్ధంతిని ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు.
