- విత్తన ధ్రువీకరణ సంస్థపై మంత్రి తుమ్మల నజర్
- సీడ్ సర్టిఫికేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ
- డిప్యూటేషన్ ముసుగులో ప్రొ. కేశవులు పదేళ్ల దోపిడీ..!
- అమెరికా టూర్ కు రూ.70 లక్షల ప్రభుత్వ సొమ్ము ఖర్చు
- కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మరో 15 విదేశీ టూర్లు
- సీడ్ సర్టిఫికేషన్ సంస్థలో రూ.50 కోట్లకు పైగా దుర్వినియోగం
- ఆదాబ్ వరుస కథనాలపై స్పందించిన మంత్రి తుమ్మల
సీడ్ సర్టిఫికేషన్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. బుధవారం ఉదయం 10.30గంటలకు మంత్రి తుమ్మల హాకా భవనంలోని సీడ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి కార్యాలయానికి వచ్చిన సమయంలో ఉద్యోగులు, సిబ్బందినే కాదు.. సంస్థ డైరెక్టర్ ప్రొ.కేశవులు కూడా లేరు. ఇదే కార్యాలయంలో మంత్రి సుమారు అర గంట వరకు ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ మాత్రం రాలేదు. అప్పటికే కార్యాలయంలో ఉన్న ఒక్కరిద్దరితో మంత్రి మాట్లాడారు. సమయ పాలన పాటించని ఉద్యోగుల విషయంలో అధికారులపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం లోపే దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సచివాలయంలో అందచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.

కదిలించిన ఆదాబ్ కథనాలు..
ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయానికి సంబంధించిన ప్రొ.కేశవులు డిప్యూటేషన్ పై విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. రెండు, మూడేళ్లు కాదు.. ఏకంగా పదేళ్లుగా కొనసాగుతున్నారు. ఇదే విషయమై ఆదాబ్ హైదరాబాద్ వరుసగా కథనాలను ప్రచురించడం జరిగింది. సంస్థలో పదేళ్ల కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, ఇలా అనేక అంశాలపై ప్రస్థావించడం జరిగింది. గడిచిన పదేళ్ల కాలంలో డైరెక్టర్ కేశవులు సంస్థ వృద్ధి కోసం ఏం చేశారు.. సంస్థ పేరుతో తను ఏ విధమైన లబ్ధి పొందారనే అంశాలను సైతం ప్రచురించడం జరిగింది. ఈ కథనాలపై మంత్రి తుమ్మల సీరియస్గా స్పందించినట్టుగా తెలిసింది. ఈ పదేళ్ల కాలంలో సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆదేశాలకు కూడా జారీ చేసినట్టుగా సమాచారం. ఈనెల 24తో కేశవులు డైరెక్టర్ పదవీకాలం కూడా ముగియనుంది.
