అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు
రిజైన్ చేయనున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే
ఖైరతాబాద్ శాసన సభ్యుడు (Khairatabad Mla) దానం నాగేందర్ (Danam Nagender) ఎమ్మెల్యే పదవికి రాజీనామా (Resign) చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ (Brs Party) నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లోకి మారిన నేపథ్యంలో అనర్హత (Disqualification) వేటు నుంచి తప్పుకోవటానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనర్హత వేటు పడితే ఆరేళ్ల దాక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందుజాగ్రత్త చర్యగా రిజైన్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
వేటు పడే వరకు వేచి చూస్తే నష్టమని, అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తేనే మంచిదని దానం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీ(Secunderabad Mp)గా పోటీ చేసి ఓడిపోయాడు. దీనివల్ల.. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా దానం నాగేందర్‌కు వేటు నుంచి తప్పించుకునే అవకాశాల్లేవు.
సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా స్పీకర్(Speaker)ను గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో ఆయన త్వరలోనే నిర్ణయం ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి.. ఈ రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తే బెటర్ అని న్యాయ నిపుణులు దానం నాగేందర్‌కు సూచించినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇదే విషయమై దానం నాగేందర్ పార్టీ అధిష్టానం ముఖ్యులతోనూ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
