ఆధునిక సదుపాయాలతో ప్రతిష్టాత్మక ప్రణాళిక
వర్సిటీ వీసీతో చర్చించిన మంత్రి తుమ్మల
దేశంలోనే తొలి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ(Earth Science University)ని కొత్తగూడెంలో ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీని అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageshwar Rao) సెక్రటేరియట్‌లోని ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా(Yogitha Rana)తో సమావేశమయ్యారు. వర్సిటీ నిర్మాణ ప్రగతిపై చర్చించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగూడెంలోని మైనింగ్ కళాశాల(Mining College)ను ఎర్త్ సైన్స్ యూనివర్సిటీగా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ విద్యా చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.
ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (Manmohan Singh) పేరు పెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. యూనివర్సిటీని అన్ని రకాల ఆధునిక మౌలిక సదుపాయాతో భవిష్యత్ తరాలకు అనుగుణంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, అధ్యాపకులు సౌకర్యవంతమైన వాతావరణంలో నేర్చుకునేలా తరగతి గదులు, హాస్టళ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు నిర్మించాలన్నారు. ప్రస్తుతం ఉన్న మైనింగ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ నిర్మాణానికి అవసరమైన భారీ నిధుల సమీకరణ కోసం ఎన్ఎండిసి(NMDC), సింగరేణి(Singareni), కోల్ ఇండియా (Coal India) సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే చర్చించినట్లు మంత్రి తెలిపారు. వారి సిఎస్ఆర్ (CSR) ఫండ్ ద్వారా యూనివర్సిటీకి నిధులు మంజూరు చేసేలా సమన్వయం జరుగుతుందన్నారు. వచ్చేవారంలో సీఎం రేవంత్(CM Revanth)ని కలిసి యూనివర్సిటీ నిర్మాణ ప్రణాళిక, నిధుల అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ విద్యా ఉపాధి రంగాల్లో నూతన దిశగా మారనుందన్నారు. యూనివర్సిటీ స్థాపనతో రాష్ట్ర విద్యా రంగం కొత్త మైలురాయిని అందుకుంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
