- వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలి
- దేశంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి
- కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ మంత్రి తుమ్మల వినతి
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ ను కోరామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించాం. అధికంగా దిగుమతులపై ఆధారపడినందున ఇబ్బందులు వస్తున్నాయి. రైతులను కాపాడే విషయంలో కొన్ని చర్చలు జరిగాయి. 1968లో చేసిన విత్తన చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన చట్టాన్ని ఆమోదించాలని కోరాం. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దేశంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచాలని కోరాం. కొత్తగూడెం విమానాశ్రయం గురించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో చర్చించాం. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధంచి భూ సేకరణ పూర్తయిందని తెలిపాం. కేంద్ర ఉక్కుశాఖమంత్రి కుమారస్వామి ని కలిసి బయ్యారం స్టీల్ విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
బయ్యారం ఉక్కుపై నిర్ణయం తీసుకోండి
బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. ఢిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఈ సమావేశంలో మాట్లాడారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్య అని పేర్కొన్నారు. అక్కడ ఉన్న మినరల్ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో కేందప్రభుత్వం పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.

అలాగే, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా మంత్రి తుమ్మల కలిశారు కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారని అన్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూ సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్.. ఐటీసీ, బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది.
దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు.
