విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా భాషా బోధన అందించాలి తప్ప వారిపై ఎల్ కే జీ నుండే బలవంతంగా పరభాషను రుద్దాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయరాదని రౌండ్ టేబుల్ సమావేశంలోని వక్తలు అభిప్రాయపడ్డారు. మాతృభాషతో పాటు ఇంగ్లీష్,హిందీ,సంస్కృతం లాంటి భాషలను అందుబాటులోకి తెచ్చి విద్యార్థుల ఇష్టానుసారమే ఆయా భాషలో వారికి పాఠాలు చెప్పే విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నూతన విద్యా పాలసీ దాని పర్యవసానాలు అనే అంశంపై సకల జనుల వేదిక,తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సంయుక్తంగా ప్రొఫెసర్ లక్ష్మణ్ , ప్రొఫెసర్ వినాయక రెడ్డిల అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన వక్తలుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ఉపాధ్యాయ సంఘాల సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి లతో పాటు అనేక మంది ప్రొఫెసర్ లు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు మాట్లాడుతూ…

గత కొంతకాలం క్రితం విద్యా కమిషన్ ఇచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ కేవలం నివేదిక మాత్రమే అని, దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని 20 రోజులలో వెబ్ సైట్ లో పబ్లిక్ డొమైన్ రూపంలో దానిని ఉంచుతామని, తదనంతరం వచ్చే సలహాలు సూచనలు స్వీకరించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందిస్తామన్నారు. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీతాల పెరుగుదల ఉంటుంది తప్ప తగ్గించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.
ముగ్గురు వైస్ ఛాన్స్ లర్ లతో పాటు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యపై పనిచేస్తున్న ఎన్జీవో సంస్థలు, విద్యార్థి సంఘాలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ… విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం బడ్జెట్ లో 18 శాతం నిధులు కేటాయించాలన్న ప్రతిపాదన మంచిగానే ఉందని, ఆచరణలో ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది అనుమానం కలిగిస్తుంది అన్నారు. విద్య వైద్యం విషయంలో ప్రభుత్వాలు బడ్జెట్లో పెద్దపీట వేసినప్పుడే సామాన్య ప్రజలకు అవి అందుబాటులోకి వస్తాయని, ఈ దిశగా ప్రభుత్వాలు ప్రయత్నించాలి తప్ప ఉచిత పథకాల వెంట ప్రభుత్వాలు పరుగు తీస్తున్నాయి అన్నారు.
విశ్వవిద్యాలయంలో 72 శాతం ఖాళీగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని, వాటిని భర్తీ చేసే విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ చైర్మన్ వి ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం వేసిన విద్యా కమిషన్ కి ప్రత్యామ్నాయంగా సకలజనుల వేదిక, తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఒక పీపుల్స్ కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ కమిషన్ గ్రామీణ స్థాయి నుంచి పట్టణం వరకు అటు ప్రజల, విద్యార్థుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒక మంచి పాలసీని రూపొందించి ప్రభుత్వానికి అందించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లో మూసివేరాదని, మూడేళ్ల చిన్నారి ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లడం అనేది అసాధ్యం కాబట్టి, ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలనే ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఇతర దేశాల్లో పరీక్ష విధానం ఉండదని, ఇక్కడ మాత్రం పరీక్షల పేరుతో ప్రతి నిత్యం బందీ ఖానా ల్లో బంధించి 16 గంటల పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నిర్బంధ విద్యను రుద్దుతున్నారన్నారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టుల్లో మహిళల సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో వారు తీసుకునే సెలవుల సమయంలో ఆయా స్కూల్ లలో ఉపాధ్యాయ పోస్ట్ ఖాళీగా ఉంటున్నాయని, ఇలాంటి విషయాలను గమనించినంగా పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపట్టాలని అన్నారు. ప్రాథమిక విద్యను విస్మరిస్తే విద్యా వ్యవస్థ బ్రష్టు బట్టి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లెక్చరర్ల సంఘం నాయకులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తులతో వ్యవస్థ మారదని, పాలకులకు అధికారులకు మధ్యన అవగాహన లేమి వల్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. కళాశాల మంజూరు చేస్తున్నారు తప్ప ఆ కళాశాలలో పనిచేసే అధ్యాపక పోస్టులను మంజూరు చేయకపోవడమే దురదృష్టకరమన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారులు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ సి ఆర్ టి ని భాగస్వామ్యం చేయకుండా విద్యాపాలసిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ లో శిక్షణ ప్రధానమని, అవసరమైతే మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులకు సైతం శిక్షణ ను అందించాలన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ మెరుగైన విద్య అందరికీ అందుబాటులోకి రావాలంటే బడ్జెట్ లో మొదటి ప్రాధాన్యత విద్యారంగానికి ఇవ్వాలని, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కళాశాలలు కోర్టు మెట్లు ఎక్కుతున్న ప్రస్తుత పరిస్థి తుల్లో అవే కోర్టులు ప్రభుత్వం ఇవ్వకపోతే తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేయాలని చెప్పాడు పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు తమ పెన్షన్ బెనిఫిట్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు విద్యాసాగర్,ప్రొఫెసర్ మనోహర్,ప్రొఫెసర్ రామకృష్ణ, కృష్ణారెడ్డి, టీజేఎఫ్ రాష్ట్ర నాయకులు యోగానందం, అవ్వారి భాస్కర్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
