రెండు నెలల్లో వేల లారీలు.. ప్రభుత్వ సొమ్ము ఎవరి జేబులోకి..?
- డీఈసీ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు నిర్మాణ బాధ్యతలు
- హైకోర్టు కొత్త భవన నిర్మాణంలో అక్రమ మట్టి రవాణా..?
- వేల లారీల మట్టి రవాణాతో ప్రభుత్వానికి కోట్లు నష్టం
- మైనింగ్ అనుమతులు లేకుండా, భారీ స్థాయిలో తరలింపు
- అక్రమ మట్టి రవాణాలో పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు..
- ప్రభుత్వం స్పందించకపోతే కోట్లలో నష్టం ఉండే అవకాశం..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన తెలంగాణ ప్రభుత్వం, నూతన హైకోర్టు భవన నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది.. సంకల్పం మేరకు పనులు కూడా ప్రారంభించింది.. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 100 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ భూమి పూజ కూడా చేశారు. సుమారు రూ.1,550 కోట్ల వ్యయంతో, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తాంది.
60 మంది జడ్జిలకు సరిపడే విధంగా ఈ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తిచేసింది. ఈ మేరకు ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం డీ. ఈ.సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు అప్పగించింది. అయితే, ఈ సంస్థ హై కోర్టు నిర్మాణ పనుల్లో వెలికితీసిన మట్టిని మైనింగ్ అనుమతులు లేకుండానే, సంబంధింత శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి..

అక్రమ రవాణాతో ప్రభుత్వ ఖజానాకు గండి..
నిబంధనల ప్రకారం నిర్మాణ ప్రాంతాల్లో వెలికి వచ్చే మట్టి లేదా ఇతరత్రా పదార్థాలను తరలించాలంటే.. ముందుగా వేలం నిర్వహించాలి.. ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ కు సుమారు రూ.80-రూ.120 చొప్పున రాయల్టీ చెల్లించాలి.. ఒక్క లారీకి సుమారు రూ.1,600 రూ.2000 వరకు నగదును డీడీ రూపేణా ట్రెజరీలో జమ చేయాలి.. అయితే, ఈ ప్రాజెక్టులో మట్టి తరలింపు పూర్తిగా నియంత్రణలకు వెలుపల జరుగుతోందని తెలుస్తోంది.. గడిచిన రెండు నెలల్లో వేల లారీలలో మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్న కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి హరీష్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం..
అధికారుల మౌనంపై ఎన్నో అనుమానాలు
కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి హరీష్ రెడ్డి వ్యవహారంపై అధికారుల మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది.. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి హరీష్ రెడ్డి కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తులతో కలిసి ఈ రవాణాను స్వయంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. “ఒక్క లారీకి ఒక రేటు” నిర్ణయించి అక్రమంగా అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో “పెద్దల వాటాలు” ఉన్నందున అధికారులు మౌనం వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది..
పర్యవేక్షణ ఎక్కడ?
పరీక్షలు, అనుమతులు, రాయల్టీలు తరచుగా మినహాయింపులే అవుతున్న నేపథ్యంలో, ఇంత భారీ స్థాయి అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత విభాగాలు మాత్రం చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టి ప్రభుత్వ ఆదాయ నష్టం ఆపాలని కోరుతున్నారు.
