Homeనల్లగొండకడియం శ్రీహరి నిరంకుశ, అవకాశవాద రాజకీయాలు…

కడియం శ్రీహరి నిరంకుశ, అవకాశవాద రాజకీయాలు…

  • తాటికొండ రాజయ్య ఘాటు విమర్శలు

స్టేషన్ ఘనపూర్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కడియం శ్రీహరి నిరంకుశంగా, కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ రాజకీయాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడడం, గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచులు ఉన్నచోట అభివృద్ధి పనులను అడ్డుకోవడం జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. “యధా రాజా తదా ప్రజ” అన్నట్టుగా ఆయన అనుచరులు కూడా అదే విధంగా రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు.

- Advertisement -

గోవర్ధనగిరి ప్రాంతంలో గిరిజన అభివృద్ధి నిధులతో చేపట్టిన పనుల విషయంలో కూడా అక్రమాలు జరిగాయని పేర్కొంటూ, పూర్తయిన పనులకు తరువాత శంకుస్థాపన చేసినట్లు చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన గిరిజన సర్పంచుల పేర్లు తొలగించి, తన కుటుంబ సభ్యుల పేర్లు మాత్రమే ప్రదర్శించడం రాజకీయ స్వార్థానికి నిదర్శనమని మండిపడ్డారు.

Tatikonda Rajaiah Criticism on Kadiyam Srihari02

కడియం శ్రీహరి రాజకీయ జీవితం అంతా పార్టీ మార్పులు, అవకాశవాదంతో నిండిపోయిందని విమర్శిస్తూ, ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ, మరోవైపు ఇతర పార్టీలతో అనుబంధాలు కొనసాగించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి రాజకీయ నైతికతకు విరుద్ధమని స్పష్టం చేశారు.

అదేవిధంగా భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ అంశాలపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మసాగర్ మండలం దేవునూరు అటవీ భూముల్లో అక్రమంగా చెట్లను నరికి, వేలాది ట్రిప్పుల మట్టి తరలించిన ఘటనల్లో ఆయన అనుచరుల ప్రమేయం ఉందని ఆరోపించారు. అధికారులను బెదిరించి అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు.

రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, “దొంగే దొంగ అని అరిచినట్టుగా” బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేయడం కడియం శ్రీహరికి తగదని విమర్శించారు. ప్రజల ముందున్న వాస్తవాలను దాచిపెట్టి నైతిక విలువల గురించి మాట్లాడడం విరుద్ధంగా ఉందన్నారు. చివరగా, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, అవకాశవాద రాజకీయాలకు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ప్రజా సేవ పేరుతో వ్యక్తిగత ప్రయోజనాలు చూసే నాయకులను ప్రజలు ఇక మన్నించరని తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News